Andu Korralu Health Benefits :చిరుధాన్యాల్లో ఒక రకమైనటువంటి అండు కొర్రలను తినడం వల్ల షుగర్, బీపీ వంటి సమస్యలురాకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, శరీరానికి ఎంతో మేలు చేసే ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఇందులో అధికంగా ఉన్నాయి. వీటిని తినడం వల్లరోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గుతారు :
అండు కొర్రలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించి.. ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2018లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక బరువుతో బాధపడేవారు రోజూ అండు కొర్రలు తినడం వల్ల బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని చైనా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన 'డాక్టర్ X.Y. జాంగ్' పాల్గొన్నారు. రోజూ అండు కొర్రలు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
షుగర్‌కు చెక్ :
అండు కొర్రలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమయ్యే షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే మధుమేహం వ్యాధితో బాధపడేవారు వీటిని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. అండు కొర్రలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. ఇవి తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు నెమ్మదిగా పెరుగుతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు :
వీటిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండు కొర్రలను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులంటున్నారు.