తెలంగాణ

telangana

ETV Bharat / health

మందు తాగాక వాంతులు అయ్యేది ఇందుకే! - పరిశోధనలో ఆశ్చర్యపోయే విషయాలు - Alcohol Side Effects

Alcohol Side Effects : 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని ఎంతగా ప్రచారం చేసినా.. తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దానివల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూనే ఉన్నారు. అయితే.. తొలి దశల్లో ఆల్కహాల్ తాగిన తర్వాత కొందరు వాంతులు చేసుకుంటూ ఉంటారు. మరి.. అలా ఎందుకు జరుగుతుంది? దాని వెనుక ఉన్న కారణాలేంటో మీకు తెలుసా??

Vomit After Drinking Alcohol
Alcohol Side Effects (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 11:52 AM IST

Why Do Some People Vomit After Drinking Alcohol : సాధారణంగా మద్యం తాగినప్పుడు రెండు రకాల ప్రభావాలు కన్పిస్తాయంటున్నారు నిపుణులు. అందులో తాగిన వ్యక్తికి మానసికంగా కలిగే హాయి ఒక రకమైతే.. అది లోపలికి వెళ్లి శరీరంలో కలిగించే మార్పులు ఇంకో రకమని చెబుతున్నారు. తాగేటప్పుడూ, ఆ తర్వాతా.. రిలాక్స్‌డ్‌గా మత్తుగా ఉంటుంది. దాంతో ఎవరేమనుకుంటారోననే సంకోచం లేకుండా తోచినట్లు ప్రవర్తిస్తారు. ఆ స్వేచ్ఛ వారికి ఆనందాన్ని ఇవ్వొచ్చు. అది బాగుంది కదా అని ఎక్కువగా తాగితే.. మాట తడబడడం, చూపు, వినికిడిలో తేడా కనిపిస్తోంది. అలాగే.. వాంతులు అవుతాయి. అయితే, ఇలా మద్యం సేవించాక వాంతులు కావడం వెనుక అనేక కారణాలున్నాయంటున్నారు. అందులో ప్రధానమైనది ఇప్పుడు చెప్పబోయేది..

ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్​ దానిని ఎసిటాల్డిహైడ్‌గా మార్చడానికి పనిచేస్తాయి. ఎసిటాల్డిహైడ్ అనేది ఒక విషపూరితమైన పదార్థం. ఇది కాలేయం ద్వారా విచ్ఛిన్నం అవుతుంది. అయితే.. లివర్ కొంత వరకు మాత్రమే ఈ ఎసిటాల్డిహైడ్‌ని తీసుకోగలదు. మోతాదు మించితే కాలేయం దానిని ప్రాసెస్ చేయలేకపోతుంది. దాంతో.. ఎసిటాల్డిహైడ్ బాడీలో పేరుకుపోయి.. కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలోని ఇతర భాగాలపైనా దాని దుష్ప్రభావాలు పడుతుంటాయి. అప్పుడు లివర్​ అలర్టై.. వాంతుల ద్వారా ఆ విషాన్ని బయటకు పంపడానికి ప్రయత్నిస్తుందంటున్నారు. ఈ కారణంగానే అతిగా మద్యం సేవించాక వాంతులు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగినప్పుడు శరీరంలో నీరు కూడా అధికంగా బయటకు పోతుందికాబట్టి.. వాంతి తర్వాత డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు.

అలర్ట్ : మందులో కూల్​​డ్రింక్ మిక్స్ చేస్తున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులివే!

2020లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో ఎసిటాల్డిహైడ్ అనే విషపూరిత పదార్థం పేరుకుపోతుంది. ఇది వాంతులు, వికారం, మైకము వంటి అసహ్యకరమైన లక్షణాలకు దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్​ఏలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బ్రియాన్ హో పాల్గొన్నారు. ఎక్కువ మద్యం తీసుకున్నప్పుడు శరీరంలో పేరుకుపోయిన ఎసిటాల్డిహైడ్ వాంతుల రూపంలో బయటకు వెళ్లిపోతుందని ఆయన పేర్కొన్నారు.

ఇంతే కాకుండా.. స్పీడ్​గా తాగడం, ఆల్కహాల్ వేరే డ్రగ్స్​తో కలిపి తీసుకోవడం వల్ల కూడా వాంతులు అవుతాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే.. ఆల్కహాల్​కు జీర్ణాశయ లైనింగ్​పై ఒత్తిడి కలిగించే సామర్థ్యం ఉంటుందంట. దీని కారణంగా కూడా వాంతులు అవుతాయంటున్నారు. ఈ పరిస్థితి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, జీర్ణ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. కారణాలు ఏవైనా.. అతిగా మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్: ఒక్కసారిగా మందు తాగడం మానేస్తే - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

ABOUT THE AUTHOR

...view details