Vishwambhara Dual Role:మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ మల్లిడి కాంబోలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో హీరో చిరంజీవి సరసన గ్లామరస్ బ్యూటీ త్రిష క్రిష్ణన్ నటించనుంది. అయితే ఆదివారం విశ్వంభర సెట్స్‌లో హీరోయిన్ త్రిష జాయిన్ కానుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే విశ్వంభరలో హీరోయిన్ త్రిష డ్యుయల్ రోల్లో నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో దర్శకుడు వశిష్ఠ హీరో మెగాస్టార్‌ను కూడా రెండు పాత్రల్లో చూపించనున్నారా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, దీనిపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు చిరంజీవి కూడా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో విశ్వంభర షుటింగ్ జరుగుతోంది.
డ్యుయల్ రోల్ నిజమే!అయితే మూవీటీమ్ ఇటీవల సినిమాలో నటించేందుకు ఇద్దరు కవల పిల్లలు కావాలంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చింది. 'మేం ఇద్దరు కవల పిల్లల గురించి వెతుకుతున్నాం. 5సంవత్సరాల వయసున్న మగ కవల పిల్లలు కావాలి' అని ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేశారు. ఆడిషన్ వీడియోలు పంపాల్సిన మెయిల్ ఐడీతో పాటు, సంప్రదించాల్సిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. దీంతో విశ్వంభరలో చిరూ డ్యుయల్ రోల్ కన్ఫార్మ్ అని ఫ్యాన్స్ అప్పుడే ఒక అంచనాకు వచ్చేశారు. ఇక తాజాగా హీరోయిన్ త్రిష కూడా డ్యుయల్ రోల్ అని ప్రచారం జరగ్గానే, అది నిజమేనంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమాలో జూనియర్ చిరంజీవిని చూపించాలి కాబట్టి కవల పిల్లల్ని వెతుకుతున్నారు అని కూడా అంటున్నారు.