Students Injured at Anganwadi Center : అంగన్వాడీ భవనం పైకప్పు పెచ్చులూడి చిన్నారులకు గాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై జిల్లా కలెక్టర్ క్రాంతి స్పందించి గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.
స్థానికుల వివరాల ప్రకారం వెంకటాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని పైకప్పు పెచ్చులూడి ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కాగా చిన్నారులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
చిన్నారులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ క్రాంతి : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పందించి, ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను పరామర్శించారు. ప్రతి చిన్నారిని కలిసి మాట్లాడారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ భవనం పరిస్థితి ప్రమాద ఘటనపై ఆరా తీయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చిన్నారులు అందరూ క్షేమంగా ఉన్న విషయాన్ని వైద్యులు చెప్పారని కలెక్టర్ క్రాంతి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.
నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు సీలింగ్‌లోని ఒక పోర్షన్లో పెచ్చులు ఊడిపడి ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే నారాయణఖేడ్ ఆసుపత్రిలో చేర్పించారు. వారందరికీ వైద్యులు చికిత్స అందించారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాను. ఈ ఘటనపై అధికారులకు విచారణకు ఆదేశించడం జరిగింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం- వల్లూరు క్రాంతి, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి
విద్యార్థులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే : మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన చిన్నారులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ భవనం పాతది కావడంతోనే పెచ్చులూడి పడినట్లుగా తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని, చిన్నారులందరూ క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
old school buildings: చిన్నారులపాలిట శాపంగా శిథిల పాఠశాల భవనాలు.. చర్యలేవి?