Vishnu Manchu Will Smith : ఇప్పటికే కెరీర్లో నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా మంచు విష్ణు రాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకు వేశారు. తరంగ వెంచర్స్ పేరుతో ఆయన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. 50 మిలియన్ డాలర్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థలో హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్‌స్మిత్ కూడా భాగస్వామి అయ్యేందుకు సిద్ధంగా ఉండటం విశేషం. ఈ విషయాన్ని మంచు విష్ణు తెలిపారు. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలోకి వచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి శుభవార్త వింటారని పేర్కొన్నారు.
తరంగ వెంచర్స్, వినోద రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోనుంది. ఇండస్ట్రీకి అవసరమయ్యే కొత్త టెక్నాలజీస్‌పై పెట్టుబడులు పెట్టనుంది. ఓటీటీ వేదికలు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చెయిన్, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్, వీఆర్, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది.
భాగస్వాములుగా ఎవరెవరున్నారంటే? - ఈ తరంగ వెంచర్స్‌లో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, విల్‌స్మిత్, దేవేష్ చావ్లా, సతీష్ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా తరంగ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.