Vidaamuyarchi Release Postponed :తమిళ స్టార్ హీరో అజిత్ తన అభిమానులకు షాకిచ్చారు. ఆయన అప్‌కమింగ్ మూవీ 'విడాముయార్చి' సంక్రాంతి బరిలో నుంచి వైదొలిగనట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. 'కొన్ని అనుకోని కారణాల వల్ల 'విడాముయార్చి'ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోతున్నాం. త్వరలోనే మరో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం' అంటూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఈ సారి సంక్రాంతి బరిలో టాలీవుడ్‌లో ముగ్గురు అగ్ర హీరోలు దిగనున్నారు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' జనవరి 10న విడుదల కానుండగా, నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'గా సందడి చేయనున్నారు. ఈ చిత్రం జనవరి 12న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక విక్టరీ వెంకటేశ్ కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ పండుగ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.
ఇక 'విడాముయర్చి' విషయానికి వస్తే, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాగిజ్ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో అజిత్‌తో పాటు త్రిష నటించగా, అర్జున్, రెజీనా తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా విడుదలైన సాంగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది. అయితే గత కొన్ని రోజుల వరకూ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. కానీ తాజాగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.