Veeranjaneyulu Vihara Yatra Review:సినిమా: వీరాంజనేయులు విహారయాత్ర; నటీనటులు: వి.కె.నరేశ్, ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్, శ్రీలక్ష్మి, ప్రియదర్శిని, రవితేజ, హర్షవర్ధన్ తదితరులు; దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల; నిర్మాతలు: బి.బాపినీడు, సుధీర్ ఈదర; సంగీతం: ఆర్.హెచ్.విక్రమ్; ఛాయాగ్రహణం: సి.అంకుర్; రచన: అనురాగ్ పాలుట్ల, శ్రీసుశి; దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల; విడుదల తేదీ: 14-08-2024
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఆహ్లాదభరితమైన కథలతో సినీప్రియుల్ని మురిపిస్తోంది. ఇప్పటికే దీని నుంచి వచ్చిన '#90s మిడిల్ క్లాస్' వెబ్‌సిరీస్ భారతదేశంలో అత్యధిక మంది ఇష్టపడిన సిరీస్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకొని రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. తాజాగా మరో మంచి మధ్యతరగతి కథను 'వీరాంజనేయులు విహారయాత్ర'తో చూపించేందుకు సిద్ధమైంది ఈటీవీ విన్. ఈ వీరాంజనేయులు కథేంటి? ఆ కుటుంబం చేసిన విహారయాత్ర ఎలా సాగింది?
కథేంటంటే: వీరాంజనేయులు (బ్రహ్మానందం) రైల్వే ఉద్యోగి. 1962లో ఉద్యోగ విరమణ చేశాక తనకొచ్చిన డబ్బుతో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. దాని పేరు హ్యాపీహోం. వీరాంజనేయులు మరణానంతరం ఆ ఇంటి బాధ్యత తనయుడు నాగేశ్వరరావు (నరేశ్)పై పడుతుంది. తను వైజాగ్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్. అయితే ఇంగ్లీష్ పరిజ్ఞానం సరిగా లేని కారణంగా స్కూల్ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తుంది.
మరోవైపు కుమార్తె సరయు (ప్రియా వడ్లమాని)కు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వస్తుంది. అప్పటికే ఉద్యోగం పోయి అయోమయంలో ఉన్న అతనికి పెళ్లికి డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాదు. సరిగ్గా అదే సమయంలో హ్యాపీ హోం అమ్మితే రూ.60లక్షలు ఇస్తామని ఓ ఆఫర్ వస్తుంది. దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని కారులో గోవాకు పయనమవుతాడు. మరి ఈ యాత్ర ఎలా సాగింది? ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్లు ఏంటి?నాగేశ్వరరావు తనయుడు వీరు (రాగ్ మయూర్)కు, సరయు చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవేంటి? ఆఖరికి సరయు పెళ్లైందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
కుటుంబంతో కలిసి చూడొచ్చా:ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా సినిమాను తీర్చిదిద్దారు. ఈటీవీ విన్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.