Upasana Helps Renu Desai :నటి రేణూ దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం రీసెంట్గా ఎన్జీవో ప్రారంభించారు. 'శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్' పేరుతో ఈ సంస్థ అనే పేరును పెట్టారు. దీంతో ఎన్నో ఏళ్ల తన కల నెరవేరిందని పేర్కొంటూ శనివారం సోషల్ మీడియాలోనూ ఆమె పోస్ట్ షేర్ చేశారు. ఇక ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు క్యూఆర్ కోడ్, శ్రీ ఆధ్య యానిమల్ షెల్టర్ పేరిట బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. విరాళంగా వచ్చిన ప్రతీ పైసా సరైన కారణాల కోసమే ఉపయోగిస్తామని ఆమె రాసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో రీసెంట్గా తను ఓ అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ అంబులెన్స్ కొనుగోలు చేయడంలో హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తన వంతు సాయం చేశారు. చరణ్ పెంపుడు శునకం 'రైమీ' పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. దీనికి ఉపాసన కొణిదెల అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన 'గోల్డెన్ హార్ట్' అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.