TV Actor Died In Road Accident : ఆడిషన్స్‌కు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురై ఓ బుల్లితెర నటుడు మరణించిన ఘటన ముంబయిలోని జోగేశ్వరిలో జరిగింది. తన బైక్‌ను ఓ ట్రక్ ఢీ కొట్టడం వల్ల ఆ నటుడు మృతిచెందాడు. అయితే పోలీసులు తనను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన అభిమానులు, కో స్టార్స్ షాక్‌కు గురయ్యారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ఆడిషన్ కోసం వెళ్తున్న సమయంలో ఓ ట్రక్కు అమన్ బైక్‌ను ఢీకొట్టింది. అయితే ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అమన్‌ను స్థానిక బాలాసాహెబ్ ఠాక్రే ట్రామా ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలోనే అతడు మరణించాడని వారు పేర్కొన్నారు.
ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్‌గా డ్రైవ్ చేసిన ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తును ప్రారంభించారు. అయితే 23 ఏళ్ల వయసులో అమన్ ప్రమాదవశాత్తూ మరణించడం బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అతడి అకాల మరణం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.