Tollywood Senior Heroines : గతంతో పోలిస్తే అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఇప్పుడు మరింత వేగంగా సినిమాలు చేయడంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వీళ్లంతా తమకు తగిన జోడీలు అంటే సీనియర్ భామలే గుర్తొస్తున్నారు. అందుకే అనుభవాన్ని వెనకేసుకున్న భామలకు గిరాకీ పెరిగినట్టైంది. మొదట్లో హీరోయిన్ కెరీర్ గట్టిగా పదేళ్లు ఉండేది. కానీ ఇప్పుడు మారిన పరిణామాలతో వాళ్లు కనీసం రెండు దశాబ్దాలకుపైగా అవకాశాలను అందుకుంటూ ముందుకెళ్తున్నారు.
త్రిష, అనుష్క, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్ - ఇలా చాలామంది సీనియర్ హీరోయిన్స్ తెలుగు సినిమాలతోనే బిజీగా గడుపుతున్నారు. కొత్త తారలకు హిట్లు, ఫ్లాపులు ఆధారంగా అవకాశాలు దొరుకుతుంటే సీనియర్ హీరోయిన్లకు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సినిమా తలుపు తడుతూనే ఉంది.
త్రిష సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అయినప్పటికీ ఇప్పటికీ కెరీర్లో జోరు చూపిస్తోంది. వర్షం సినిమా రీరిలీజ్ అయితే ఆమె అందాన్ని, ఆమె సందడిని మరోమారు ఆస్వాదిస్తున్నారు అభిమానులు. ఇప్పుడు కూడా తన అందానికి అనుభవాన్ని రంగీకరించి జోరు ప్రదర్శిస్తోంది. చిరంజీవితో విశ్వంభరలో నటించే ఛాన్స్‌ను అందుకుని సెట్లోకి అడుగుపెట్టింది. తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.
మరో సీనియర్ భామ అనుష్క కూడా బిజీ అవ్వడం మొదలుపెట్టింది. క్రిష్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది.
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ జోరు కూడా ఏమాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తోంది. భగవంత్ కేసరితో సక్సెస్ అందుకున్న ఆమె ప్రస్తుతం సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రం చేస్తోంది. భారతీయుడు 2లోనూ నటిస్తోంది. హిందీలో ఉమా అనే ప్రాజెక్ట్ చేస్తోంది. తెలుగులో చేసేందుకు మరిన్ని కథలు చేస్తోంది.