Tollywood Movies On Mumbai Backdrop : ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీయడం అనేది మన టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. రొటీన్‌గా లోకల్ బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకునే మన డైరెక్టర్లు అప్పుడప్పుడు కొత్తదనం కోసం ముంబయి లేదా కోల్‌కతా పరిశరాల్లో సినిమాలు తీస్తుండటం మనం చూశాం. అప్పట్లో వచ్చిన 'బొంబాయి ప్రియుడు' నుంచి ఇటీవలే వచ్చిన సాహో వరకూ అన్ని ముంబుయి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినవే. ఇప్పుడు మరోసారి ఈ ట్రెండ్ తెరపైకి వచ్చింది. ఫారిన్ ట్రిప్‌లు వేస్ మన డైరెక్టర్లు మళ్లీ ముంబయి బాట పట్టి సరికొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. రామ్- పూరి 'డబుల్ ఇస్మార్ట్', శేఖర్ కమ్ముల - ధనుశ్ మూవీ(ధారావి - రూమర్డ్ టైటిల్), దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్' ఇలా పలు సినిమాలు తమ చిత్రీకరణను ముంబయిలో జరపుకుంటున్నాయి.
గతంలోనూ ఈ ట్రెండ్ తెగ పాపులరైంది. టైటిల్లోనే ఏకంగా 'బొంబాయి ప్రియుడు' అని పెట్టి సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఓ సినిమాను తీసి మంచి హిట్ అందుకున్నారు. ఇది ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ అందమైన ప్రేమ కథ. జెడి చక్రవర్తి, రంభ జంటగా నటించింన ఈ సినిమా ఏకంగా 100 డేస్ ఫంక్షన్ జరుపుకుంది. ఆ తర్వాత 1991లో విడుదలైన 'రౌడీ అల్లుడు' చిత్రం కూడా కొంత ముంబై బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఆటో జానీ అనే పాత్రలో నటించారు. ఆయన ముంబయి వీధుల్లో ఆటోవాలాగా కనిపించారు.
ఇక కోడి రామకృష్ణ తెరకెక్కించిన 'దేవి పుత్రుడు' సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా ముంబయిలో దొంగతనాలు చేసే వ్యక్తిగా కనిపించి అలరించారు. ఇలా ముంబయితో మన హీరోలకు మంచి అనుబంధమే ఉంది. ఇది కాకుండా పూర్తి ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో ఓ సాలిడ్ హిట్‌ను తెరకెక్కించారు డైరెక్టర్ పూరి. మహేశ్ బాబు లీడ్ రోల్లో వచ్చిన బిజినెస్ మాన్ అక్కడి మాఫియా బ్యాక్‌డ్రాప్‌లోనే నడుస్తుంది. ఇందులో మహేశ్ ముంబయి డాన్‌గా నటించి హిట్ అందుకున్నారు. అంతేకాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం కూడా ముంబయి కథాంశంతోనే నడుస్తుంటుంది.