Chiranjeevi Padmavibhushan:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీఇండస్ట్రీలో రికార్డులకు కేరాఫ్ ఆడ్రస్. సినిమాలకు పదేళ్లు దూరంగా ఉన్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గని స్టార్ చిరంజీవి. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది. తాజాగా దిల్లీలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి అవార్డులు, రికార్డులు, సేవా కార్యక్రమాలపై ఓ లుక్కేద్దాం.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణిదెల శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి. అలా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు 'పునాదిరాళ్లు' సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత వెనక్కితిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే 'నటన అంటే కమల్ హాసన్, స్టైల్ అంటే రజనీకాంత్ ఈ రెండూ ఉన్న కథానాయకుడు మెగాస్టార్!' అనేంతలా ఎదిగారు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ లక్షలాదిమంది ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. 90ల్లో డ్యాన్స్ అంటే చిరంజీవిదే. సినిమాల్లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆడియెన్స్‌ను అలరించేవారు. యాక్షన్ సీన్స్‌తో మాస్ ప్రేక్షకుల్ని కూడా తనవైపు తిప్పుకున్నారు. ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లో తనదైన మార్క్ చూపించి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
రికార్డులు: 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'రౌడీ అల్లుడు', 'గ్యాంగ్ లీడర్' వంచి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెంచారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ అనేక రికార్డులు సృష్టించారు. 'ఇంద్ర', 'ఠాగూర్', 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్', 'స్టాలిన్' సినిమాలతో సంచలన విజయాల్ని అందుకున్నారు. ఇక 2007 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.