Actress With Only 2 Hit Movies : కుటుంబం వ్యతిరేకించినా సినిమాల్లోకి వచ్చారు. విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో బోల్డ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తన 22 ఏళ్ల కెరీర్లో కేవలం 2 హిట్లు మాత్రమే ఇచ్చారు. అయినప్పటికీ భారీగానే నెట్‌వర్త్ కలిగి ఉన్నారు. ఇంతకీ ఆ నటి ఎవరంటే?
తన కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమలోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి వెళ్తానని చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. వారి మాటను ధిక్కరించి నటనను కెరీర్‌గా ఎంపిక చేసుకున్నారు. దీంతో ఆమె తండ్రి ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అయినప్పటికీ అనేక కష్టాలకు ఎదుర్కొని బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించారు. ఆమె రీమా లాంబా అలియాస్ మల్లికా షెరావత్. సినిమాల్లోకి వచ్చాక ఆమె తన తల్లి ఇంటి పేరునే పెట్టుకుని మల్లికా షెరావత్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఫస్ట్ మూవీ ఆఫర్ అదే!
మల్లికా షెరావత్ బాలీవుడ్ జర్నీ 'జీనా సిర్ఫ్ మేరే లియే'తో ప్రారంభమైంది. ఆమె ఇందులో కీలక పాత్ర పోషించారు. అయితే షెరావత్కు బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం 2004లో వచ్చిన 'మర్డర్' మూవీ. రూ. 5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 22.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో మల్లికా షెరావత్ భారీ స్టార్‌డమ్‌ను అందుకున్నారు.