The Raja Saab Movie Song : రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హీరో ప్రభాస్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సెట్స్‌లోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
అదేంటంటే, ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టెప్పులేయనున్నారట. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌తో చిత్రీకరించనున్న ఆ పాటలో ప్రభాసే హైలైట్‌గా నిలవనున్నారని టాక్ నడుస్తోంది. దీని కోసమని మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది విన్న ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. వింటేజ్ ప్రభాస్‌ను మళ్లీ చూడొచ్చు అంటూ సంబరపడుతున్నారు.
బాహుబలి ముందు ప్రభాస్ చేసిన పలు సినిమాల్లో ఆయన యాక్టింగ్‌తోనే కాకుండా తన డ్యాన్స్ మూవ్స్తోనూ ఆకట్టుకున్నారు. అయితే బాహుబలి తర్వాత వచ్చిన 'బాహుబలి 2', 'సాహో', 'రాధేశ్యామ్' లాంటి సినిమాల్లో డ్యాన్స్‌కు అంత స్కోప్ లేకుండా పోయింది. సాహోలో మాత్రం సైకో సయ్యాన్ అనే సాంగ్‌కు మాత్రమే ఆయన స్టెప్పులేశారు. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. మునపటి ప్రభాస్‌ను ఎప్పుడు చూస్తామా అంటూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్‌తో వారికి మాస్ ట్రీటే ఇవ్వనున్నారు డైరెక్టర్ మారుతి.