Sankranthiki Vasthunnam Pre Release Event : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి నిజామాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్ మాట్లాడారు.
ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది : వెంకటేశ్
సంక్రాంతి సినిమా అంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ కలిసి చూసేలా ఉండాలని వెంకటేశ్ అన్నారు. అలాంటి వినోదంతోనే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తెరకిక్కిందని తెలిపారు. "నా కెరీర్ ప్రారంభం నుంచి ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ఎంతో ప్రేమతో నా సినిమాలు చూస్తున్నారు. అందుకే ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాను. అద్భుతమైన పాటలు, యాక్షన్, మాటలు, కామెడీతో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ప్రేక్షకుల అభిమానం మరోసారి ఈ సంక్రాంతికి చూపిస్తారు. మా సినిమానే కాదు, 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' కూడా పెద్ద విజయం సాధించాలి. దిల్ రాజుతో ఇప్పటి వరకు 4 సినిమాలు చేశా. అన్నీ హిట్ అయ్యాయి. నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం సంతోషంగా ఉంది" అని వెంకటేశ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యానించారు.
'సినిమా కోసం వెంకటేశ్ ప్రాణం పెట్టేస్తారు'
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేశ్ చాలా బాగా నటించారని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. కచ్చితంగా పండగకి సంక్రాంతి వస్తున్నాం సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "దిల్ రాజు సంస్థలో ఇది నా ఆరో సినిమా. ఐశ్వర్య, మీనాక్షి చాలా బాగా యాక్ట్ చేశారు. వెంకటేశ్ అంటే అందరికీ నచ్చే వెంకీ మామ. సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. ఆయన కెరీర్‌లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. ఈ సినిమాలో చేసిన పాత్ర మరింత ప్రత్యేకంగా నిలిచిపోతుంది. సినిమాకి పనిచేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో, ప్రచార కార్యక్రమాల్లోనూ ఆయన అంతే ప్రోత్సాహం అందిస్తారు. ఈసారి థియేటర్లకి వచ్చిన ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి బయటకు పంపిస్తాం" అని అనిల్ రావిపూడి మాట్లాడారు.
'వెంకటేశ్ భావితరాలకు స్ఫూర్తి'
తాను, శిరీష్ నిజామాబాద్ థియేటర్లలో సినిమాలు చూసి, సినీ రంగంపై ఇష్టం పెంచుకున్నామని నిర్మాత దిల్‌రాజ్ తెలిపారు. సినిమా రంగంలోకి వస్తామనుకోలేదని, ఈ ప్రయాణం వెనక ఎంతో మంది హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సహకారం ఉందని పేర్కొన్నారు. "మా 58వ సినిమా వేడుకని నిజామాబాద్‌లో జరుపుకోవడం ఆనందంగా ఉంది. అనిల్ ప్రతి సినిమాని ఎలా సక్సెస్ చేయాలో ఆలోచిస్తాడు. 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' మేం నిర్మిస్తే, పండగకి వస్తున్న 'డాకు మహారాజ్' సినిమానీ మేమే పంపిణీ చేస్తున్నాం. వెంకటేశ్ సెట్లో ఉంటే నిర్మాత ఉండాల్సిన పనిలేదు. చిత్ర బృందాన్ని పరుగులు పెట్టిస్తారు. వెంకటేశ్ పనితీరు భావి తరాలకి స్ఫూర్తి. ఐశ్వర్య, మీనాక్షి చాలా సహజంగా నటించారు. అనిల్ తను రాసుకున్న మూడు కథల్నీ ఒక్కటిగా చేసి ఈ సినిమాని రూపొందించాడు. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని నవ్విస్తాడు" అని దిల్‌రాజ్ పేర్కొన్నారు.
'నాది చాలా ప్రత్యేకమైన పాత్ర'
'సంక్రాంతి వస్తున్నాం' సినిమాలో భాగ్యం అనే పాత్రను తాను చేశానని హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తెలిపారు. అది చాలా ప్రత్యేకమైన పాత్ర అని పేర్కొన్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మంచి కుటుంబ వినోదంతో రూపొందిన సినిమా అని వెల్లడించారు. కాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్య నారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరాల రత్నాకర్, నటులు నరేశ్ వీకే, మీనాక్షి చౌదరి, సాయి, నారాయణ, తమ్మిరాజు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రతిసారీ విజయమే
గుళ్లోనో, బళ్లోనో, కాలేజీలోనో లేదంటే ఆఫీసులోనో మీకో లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. దాన్ని దయచేసి భార్యకి చెప్పకండని సలహా ఇస్తున్నాడు ఓ మాజీ పోలీసు ఆఫీసర్. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన చేపట్టిన ఆపరేషన్ వెనక సంగతులేమిటో తెలియాలంటే 'సంక్రాంతికి వస్తున్నాం' చూడాల్సిందే. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. శిరీష్ నిర్మించగా, దిల్‌రాజు సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరో మహేశ్ బాబు 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా సోమవారం రిలీజ్ చేశారు. 'ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికీ పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది. ఇట్స్ నేచురల్' అంటూ తనదైన శైలిలో సందడి చేశారు హీరో వెంకటేశ్. 'హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ప్రతిసారీ విక్టరీయే' అనే డైలాగ్ ట్రైలర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఫుల్ ట్రెండింగ్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రమోషన్స్- యూట్యూబ్‌లో పాటల హల్చల్