Shankar Sequels:స్టార్ డైరెక్టర్ శంకర్ లేటెస్ట్ ప్రాజెక్ట్ 'భారతీయుడు- 2' సినిమా జూలై 12న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా డైరెక్టర్ శంకర్ పాన్ఇండియా రేంజ్లో దీన్ని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో హిందీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శంకర్‌కు తాజాగా సీక్వెల్స్ గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఆయన సినిమాల్లో భారీ విజయాలు సాధించిన 'శివాజీ', 'నాయక్', 'అపరిచితుడు' కూడా సీక్వెల్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగారు. దీనికి ఆయన ఆసక్తికరంగా బదులిచ్చారు. సరైన సబ్జెక్ట్ ఉంటేనే తాను సీక్వెల్స్ ప్లాన్ చేస్తానని అన్నారు.
'నా సినిమాలన్నీ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటాయి. అదే సినిమా దేశవ్యాప్తంగా అందరు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే అది పాన్ఇండియా మూవీ అవుతుంది. 'శివాజీ', 'నాయక్', 'అపరిచితుడు' సినిమాలకు సీక్వెల్స్ చేయమని ప్రేక్షకులు నన్ను కూడా అడిగారు. నేనూ చేద్దామనే అనుకున్నా. కానీ, ఏదో సీక్వెల్ తీయాలి కాబట్టి చేద్దాం అనుకోను. సబ్జెక్ట్ నాకు కనెక్ట్ అవ్వాలి. అప్పుడే వాటి గురించి ఆలోచిస్తా' అని అన్నారు.
దీంతో శంకర్ నుంచి సీక్వెల్ రావడానికి చాలా సమయం పట్టవచ్చు, ఒకవేళ రాకపోవచ్చు. ఆయన ఇప్పట్లో సీక్వెల్స్ తీసే ఆలోచనలో లేరని ఆ రిప్లై చూస్తే అర్థమవుతోంది. ఇక భారతీయుడు తర్వాత శంకర్ 'గేమ్ ఛేంజర్'పై దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమా దాదాపు 90 శాతం పూర్తయ్యిందని సమాచారం. రామ్‌చరణ్ హీరోగా పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇంకో 10- 15 రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. దీని తర్వాత ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.