Sonali Bendre THE BROKEN NEWS : బాలీవుడ్‌లో స్థిరపడిన చాలా మంది హీరోయిన్‌లు తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ఆ లిస్టులో సోనాలి బింద్రే(49) ఒకరు.
ఇండియన్ సినిమాల్లోని పలు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన ది బ్రోకెన్ న్యూస్ రెండో సీజన్ మే 3న రాబోతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారామె. ఇందులో తన కెరీర్, డ్యాన్స్ కష్టాలు, పాత్రల ఎంపిక, ఇబ్బందుల గురించి మాట్లాడారు.
అలా చేయలేకపోతే వెళ్లిపోదామనుకున్నా - "నేను ట్రైన్డ్ డ్యాన్సర్ కాదు. సినిమాల్లోకి వచ్చాక నా డ్యాన్స్‌పై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది డ్యాన్స్ కొరియేగ్రాఫర్లు తిడుతుండేవారు కూడా. ఆ సమయంలో డ్యాన్స్ రాకపోతే హీరోయిన్ కాలేరనే భావన ఉండేది. దీంతో షూట్‌కు ముందు, తర్వాత ఎంత సమయం దొరికినా 'బాలీవుడ్ డ్యాన్స్'కు శిక్షణ తీసుకునేదాన్ని. అయితే నా కెరీర్‌లో ఐదు సినిమాల తర్వాత నాకు హమ్మా హమ్మా సాంగ్ వచ్చింది. దీనికి ప్రభుదేవా కొరియోగ్రాఫర్. అతని సోదరుడు రాజు సుందరం పక్కన డ్యాన్స్ చేయాలి. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ కావడంతో నేను ఛాలెజింగ్‌గా తీసుకొని చేశాను. ప్రభుదేవ సాంగ్ చేయగలిగితే ఇండస్ట్రీలో ఉండాలి లేకపోతే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోవాలని అనుకున్నాను" అని తెలిపింది.
ఇండస్ట్రీలో ఉండొచ్చని ధైర్యం వచ్చింది - "ప్రభుదేవా సోదరుడు రాజుతో డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ల ఫాదర్ సుందర్ మాస్టర్ కూడా సెట్‌లో ఉన్నారు. మణిరత్నం సార్ ఎప్పుడూ భారీ లాంగ్ షాట్‌లు చేసేవారు. కాబట్టి మేము సాంగ్ మొత్తం ఒకే షాట్‌లో కంప్లీట్ చేశాం. అప్పుడు నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ నచ్చి సుందర్ మాస్టర్ జీ రూ.100 తీసి నాకు ఇచ్చి, బాగా చేశావని చెప్పారు. నాకు మరెవరి నుంచి సర్టిఫికేట్ అవసరం లేదు అని అన్నారు. దీంతో నేను ఇండస్ట్రీలో ఉండొచ్చని నాకు ధైర్యం వచ్చింది. అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా సూపర్ హిట్ మూవీ బాంబేలో నాకు ప్రధాన పాత్ర రాలేదు. కానీ హమ్మా హమ్మా సాంగ్‌తో చాలా పేరు వచ్చింది" అని సోనాలి వివరించింది.
వ్యతిరేకంగా పోరాడాలి - "ఇప్పుడు నా వయసుకు తగిన పాత్రలు వస్తాయని భావిస్తున్నాను. సినిమా రంగంలో, మహిళా నటీనటులు అవకాశాల కోసం పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడాలి. కానీ ప్రస్తుతం మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. మార్పు నెమ్మదిగా అయినా వస్తున్నందుకు సంతోషం." అని సోనాలి తెలిపింది.
అందుకే సినిమాలకు దూరం -సోనాలి నిర్మాత గోల్డీ బెహ్ల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2005లో కొడుకు పుట్టిన తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంది.2013లో చివరిసారిగా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా సినిమాలో సోనాలి బిగ్ స్క్రీన్‌పై కనిపించింది. అప్పటి నుంచి గ్లామర్ రోల్స్‌లో కనిపించడం ఇష్టం లేక సినిమాలకు దూరంగా ఉన్నానని సోనాలి తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్రామేబాజ్, టెలివిజన్ సిరీస్ అజీబ్ దాస్తాన్ హై యే వంటి రియాలిటీ టీవీ షోలలో న్యాయనిర్ణేతగా కనిపించింది. 2018లో క్యాన్సర్(Sonali Bendre cancer) బారిన పడిన తర్వాత కూడా ఆమె చాలా కాలం పాటు అస్సలు కనపడలేదు.