Slumdog Millionaire Sequel : 2008లో విడుదలై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమా 'స్లమ్‌డాగ్ మిలియనీర్'. అప్పట్లోనే ఈ చిత్రం ఏకంగా 8 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకొని ఇండియన్ సినిమా ఖ్యాతి పెంచింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు కథనాలు వెలువడటం వల్ల మూవీ లవర్స్‌లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.
'బ్రిడ్జ్ 7' అనే నిర్మాణసంస్థ 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సీక్వెల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ది హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది. ఈ క్రమంలో ఈ విషయంపై డైరెక్టర్ కూడా స్పందించారు. "కొన్ని కథలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఎన్నేళ్లైనా అవి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అటువంటి వాటిల్లో ఒకటి 'స్లమ్‌డాగ్ మిలియనీర్'. మంచి కథకు భాషాపరమైన హద్దులు అస్సలు ఉండవని ఈ సినిమా ఎప్పుడో నిరూపించింది" అని ఆయన అన్నారు.
ఇక 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా విషయానికి వస్తే 2008లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబయి మురికివాడల్లో నివసించే చిన్నపిల్లల జీవనం, అలాగే వారిలో ఉండే ట్యాలెంట్‌ను ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించారు డైరెక్టర్. అలాంటి వాతావరణంలో పెరిగిన ఓ బాలుడు తన ట్యాలెంట్‌తో ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 2 కోట్లను ఎలా గెలుచుకున్నాడనేది ఈ సినిమా స్టోరీ. ప్రముఖ డైరెక్టర్ డానీ బాయిల్ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా 10 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకోగా, 8 విభాగాల్లో అవార్డును సొంతం చేసుకుంది. నాలుగు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను కూడా 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సొంతం చేసుకుంది.