Saripodhaa Sanivaaram Pre Release Event : నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్టు 29న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీటీమ్ పాల్గొని సందడి చేసింది. సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా
"కొవిడ్ తర్వాత ఆడియెన్స్ థియేటర్లకు రావట్లేదని చాలామంది అంటున్నారు. మంచి సినిమా తీస్తే తప్పకుండా వస్తారు, ఇంకా వస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం మిస్ అవ్వదు. నేను ఈ మాట చాలా నమ్మకంగా చెబుతున్నాను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా 'సరిపోదా శనివారం'. ఇక వివేక్ ఆత్రేయ కెరీర్‌లో ఇది ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. డి.వి.వి. దానయ్యను వెతుక్కుంటూ వచ్చిన మరో మంచి సినిమా ఇది" - హీరో నాని
సూర్య - చారు అలా గుర్తుండిపోతారు
ఇదే వేదికపై హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. "నానితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. 'గ్యాంగ్‌లీడర్'లో పెన్సిల్, ప్రియ పాత్రలు ఎలా అయితే ఆకట్టుకున్నాయో, ఇప్పుడు 'సరిపోదా శనివారం' సినిమాలోని సూర్య - చారు పాత్రలు కూడా ప్రేక్షకులకు అలానే గుర్తుండిపోతాయి" - హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్.
నాని నాకు అవకాశం కాదు కాన్ఫిడెన్స్ ఇచ్చారు
"అంటే సుందరానికీ! తర్వాత ఎటువంటి సినిమా చేయాలో నాకు అర్థం కాలేదు. అందరూ నాని నీకు అవకాశం ఇచ్చారని అంటున్నారు. అది చాలా చిన్నపదం. నాని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉంది" - డైరెక్టర్ వివేక్ ఆత్రేయ