Samantha Hema Committee Report : హేమ కమిటీ రిపోర్ట్‌పై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరుపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(wcc) నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని పేర్కొంది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం డబ్ల్యూసీసీ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పింది. పని ప్రదేశాల్లో భద్రత అనేది మహిళల కనీస అవసరమని చెప్పుకొచ్చింది.
"కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(wcc) పని తీరును నేను చాలా ఏళ్లుగా గమనిస్తున్నాను. wcc నిర్ణయం వల్లే హేమ కమిటీ రిపోర్ట్ ఇవ్వగలిగింది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, చిక్కులు చాలా వెలుగులోకి వచ్చాయి. భద్రంగా ఉండే సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలు. అయినా ఇప్పటికీ వీటి కోసం చాలా మంది పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి ప్రయత్నాలకు ఫలితం దక్కడం లేదు. కనీసం ఇప్పటికీ అయినా ఈ విషయాలపై నిర్ణయాన్ని తీసుకుంటారని భావిస్తున్నాను. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(wcc)లో ఉన్న నా స్నేహితులకు, సోదరీ మణులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని సమంత చెప్పుకొచ్చింది.
కాగా, మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతో ఈ విషయంపై ఇతర చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలపై 17 కేసుల వరకు నమోదవ్వడం సెన్సేషన్ అవుతోంది.