Rohit Shetty Cinema Journey : యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టిది ప్రత్యేక శైలి. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఈ స్టార్ డైరెక్టర్, 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'సింగం అగైన్' లాంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. అయితే ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న ఈయన కెరీర్ తొలినాళ్లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఇంతకీ ఆయన సినీ కెరీర్ ఎలా సాగిందంటే?
స్టార్ డైరెక్టర్ కొడుకైన తప్పని ఇబ్బందులు!
రోహిత్ శెట్టి లెజెండరీ యాక్షన్ డైరెక్టర్ ఎంబీ శెట్టి కుమారుడు. 1982లో ఎంబీ శెట్టి మరణం తర్వాత రోహిత్ శెట్టి కుటుంబం ఆర్థిక కష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. దీంతో ఆయన తల్లిపైనే కుటుంబ భారం మొత్తం పడింది. అయితే రోహిత్ తన తల్లి బాధ్యతలను షేర్ చేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో మలాద్ నుంచి అంధేరీ వరకు నడిచేవెళ్లేవారట. అలాగే రోజుకు రూ.35 సంపాదించి కుటుంబాన్ని పోషించేవారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
"నేను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని కాబట్టి అందరూ నా కెరీర్ సాఫీగా సాగిపోయిందని అనుకుంటారు. కానీ నా సినీ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. కెరీర్ తొలినాళ్లలో రోజుకు రూ. 35 మాత్రమే పారితోషకంగా అందుకునేవాడిని. తినడానికి టైమ్ సరిపోక భోజనాన్ని ప్రయాణం మధ్యలో తినేవాడ్ని. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో సెట్ లోనే భోజనం చేసేవాడిని." అంటూ రోహిత్ ఎమోషనలయ్యారు.
రేర్ రికార్డు సొంతం
అయితే రోహిత్ శెట్టి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఏకంగా తాను తెరకెక్కించిన 10 సినిమాలను రూ.100 కోట్ల క్లబ్ లోకి చేర్చి బాక్సాఫీస్ కింగ్ అయ్యారు రోహిత్. అంతే కాదు ఇండియన్ డైరెక్టర్స్ లోనే ఎక్కువ సినిమాలను రూ.100 కోట్ల క్లబ్ లోకి చేర్చిన దర్శకుడిగా నిలిచారు.