Ramayan Ranbir Kapoor Dual Role : బాలీవుడ్లో తెరకెక్కుతోన్న అతిపెద్ద ప్రాజెక్ట్ 'రామాయణ'. ఎలాంటి అధికారిక లాంఛ్ లేకుండా షూటింగ్‌ను గుట్టుచప్పుడు కాకుండా శరవేగంగా చేసుకుంటూ పోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఇది ముస్తాబవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సీతారాములుగా రణ్‌బీర్, సాయి పల్లవి లుక్స్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ రామాయణలో ఊహించని ఎన్నో ఆకర్షణలు ఉన్నాయట.
అందరూ అనుకున్నట్టుగా ఈ రామాయణలో రణ్‌బీర్ కపూర్ కేవలం రాముడి వేషంలోనే కాకుండా పరశురాముడిగానూ కనిపించబోతున్నారని తెలిసింది. రెండు లుక్స్ మధ్య అస్సలు గుర్తుపట్టలేనంత వ్యత్యాసం చూపించబోతున్నారని టాక్. పైగా రెండు శ్రీవిష్ణు అంశ ఉన్న అవతరాలే కనుక దానికి అనుగుణంగా రణ్‌బీర్‌తో ద్విపాత్రాభినయం చేయిస్తున్నారని సమాచారం.
ఇక రావణుడు ఎత్తుకెళ్ళేటప్పుడు, సీత మాతాను కాపాడేందుకు ప్రయత్నించి తనువు చాలించే జటాయువు పక్షికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నారని తెలిసింది. తొలి భాగంలో రామసీత వివాహం, పద్నాలుగేళ్లు వనవాసం, చివర్లో రావణుడి ఎంట్రీతో శుభం కార్డు వేస్తారట. రెండో భాగంలో రావణుడిగా యశ్ విశ్వరూపం ఉంటుందని సమాచారం.