Awareness of Childrens Expenses : చిన్న పిల్లలు తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్తే చాలు ఏదో ఒక వస్తువు కావాలని మారాం చేస్తుంటారు. గారాబంగా చూసే తల్లిదండ్రులు అవి అవసరమో, కాదో చూడకుండానే అడిగిందే తీసుకుంటారు. ఇదే అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సివస్తుందని నిపుణులు చెపుతున్నారు. తల్లిదండ్రులు షాపింగ్, హోటళ్లకు సినిమాలకు పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. చిన్నప్పటి నుంచే చాలామంది విద్యార్థులకు ట్యాబులు, చరవాణులు కొంటున్నారు. వాటి వినియోగంపై కనీసం తెలియకపోవడం వల్ల దుర్వినియోగం చేస్తున్నారు.
తల్లిదండ్రులు చిన్నపిల్లలకు నేర్పించాల్సినవి : సమాజంలో ఉన్నతంగా ఎలా ఎదగాలని విషయాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలని నిపుణులు వివరిస్తున్నారు. మహిళలను గౌరవించడం నుంచి ఎవరితో ఎలా ఉండాలో తెలియజేయాలి. కళాశాలల్లో తోటి విద్యార్థినుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటివి చోటుచేసుకోవడానికి నైతిక విలువలు లోపించడమే కారణం సమాజంలో ఎలా జీవించాలి, ఎదురయ్యే సమస్యలు ఎలా ఎదుర్కొనాలి వంటివి నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఒకరిని చూసి మరొకరు : పిల్లలు ఒకరిని చూసి మరొకరు వస్తువులు కొనడానికి పోటీపడుతున్నారు. వాటి అవసరం ఎంత ఉన్నదన్నది చూడటంలేదు. ఒకరి ఇంటిలో ఏదైనా కొత్తది చూస్తే దాన్ని తమ పిల్లలకు కూడా తీసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. మొబైలోనూ కొత్తగా వచ్చే ఫీచర్లు ఉండేవి తీసుకుంటున్నారు.
రూ.వేలల్లోనే ఖర్చు : పిల్లలను షాపింగ్‌లకు తీసుకెళ్లినప్పుడు కొనేవి పెరిగిపోతుండడంతో ఖర్చు రూ. వేలల్లోనే అవుతుంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రెడిట్, డెబిట్ కార్డులను విరివిగా చూస్తున్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్లలోనూ ముందుంటున్నారు. ఆట వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఇవి చాలా వరకు ఉంటున్నాయి. నిర్ణీత వయసు రాకుండానే కార్లు, బైక్‌లు ఇవ్వడం, వారు ప్రమాదాలకు గురవడం ఇటీవల కాలంలో కనిపిస్తున్న విషయం ఇదే.
మంచిర్యాలలోని సురేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్న ఆయన ఇంట్లో పిల్లలకు సైతం అలవాటు చేశాడు. దీంతో ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుతో పిల్లలు అనవసరపు వస్తువులు సైతం కొనుగోలు చేస్తున్నారు. దీంతో నెలాఖరుకు బిల్లు రూ. వేలల్లో ఉంటోందని సురేష్ వాపోతున్నారు.
ఇటీవలి కాలంలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ మితిమీరుతోంది. తప్పనిసరిగా కుటుంబ సంపాదన, నెలవారీ ఖర్చులను పిల్లలకు తెలిసేలా పెంచాలి. చిన్నతనం నుంచే అడిగినది కొనివ్వడం ద్వారా పెద్దవాళ్లయ్యాక ఇవ్వకపోతే పెద్దలపై వ్యతిరేక భావన కలిగే అవకాశాలు ఎక్కువ. షాపింగ్, ఇతరత్రా విషయాల్లో మనం పెడుతున్న ఖర్చు ఎంతో చిన్నారులకు అర్థం అయ్యేలా చేయాలి.
పిల్లల నడవడిక వారి అలవాట్లు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటాయి. తమ పిల్లలకు విలాసవంతమైన జీవనం ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. దీంతో చదువుపై కాకుండా ఇతర అంశాలపై విద్యార్థులకు ఆసక్తి కలుగుతుంది. పిల్లలపై ఖర్చుపెట్టే విషయంలో తల్లిదండ్రులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అప్పుడే పిల్లలకు సైతం ఆదాయం, ఖర్చులపై పూర్తి అవగాహన వస్తుంది. దుబారా తగ్గించి, పొదుపుపై ఆలోచన వచ్చేలా చేయాలి.
మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తున్నారో మీరు చూడొచ్చు! - ఈ ఫీచర్ గురించి మీకు తెలుసా?
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్! ఆ దేశం కీలక నిర్ణయం!!