Survey Halted After Tiger Sighting : బోదకాలు సోకిందంటే నివారణ ఉండదు. నియంత్రణ మాత్రమే మందు. ఈ వ్యాధితో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఈ వ్యాధి నివారణకు కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. అదే ముందస్తుగా గుర్తించడం. ఈ మేరకు అధికారులు ఆసిఫాబాద్లో సర్వే చేస్తుండగా, పులి భయంతో బ్రేక్ పడింది. ఈ సర్వే కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేయాలి. అప్పుడు బోదకాలు వ్యాధికి సంబంధించిన సూక్ష్మజీవి రక్తంలో జీవిస్తుంటుంది. ఆ సమయంలో చేస్తేనే ఫలితం తెలుస్తుంది. అయితే రాత్రిళ్లు పులి సంచార భయంతో మధ్యలోనే సర్వేను నిలిపివేశారు. దీంతో అక్కడి ప్రజలు ఇంకా ఎప్పుడెప్పుడు సర్వే చేస్తారా అని చూస్తున్నారు.
ఈ జిల్లాలోని మురుగువాడలు, మారుమూల గ్రామాలు, సరఫరా చేసినా బోదకాలు మాత్రలు వేసుకోని ప్రాంతాలను గుర్తించారు. అక్కడ బృందాల ద్వారా సర్వే చేయాలని వైద్యశాక అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 12 గ్రామాలను ఎంచుకొని అందులో ఒక్కో గ్రామంలో 300 చొప్పున రక్త నమూనాలు సేకరించేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈనెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు గ్రామాల్లో సర్వే చేసి 1,200 రక్త నమూనాలను సేకరించగా.. అనంతరం పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీంతో సర్వేను నిలిపివేశారు. ఇప్పటికే సేకరించిన నమూనాలను పరీక్షించగా అన్నింటినీ కూడా నెగగిటివ్ వచ్చింది.
రాత్రి వేళ మాత్రమే బోదకాలు పరీక్షలు : ఇందుకు సంబంధించిన పరీక్షలను రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మాత్రమే చేస్తారు. బోదకాలు క్యూలెక్స్ ఆడదోమ కాటుతోనే సోకుతుంది. దీనిలోని మైక్రో ఫైలేరియా సూక్ష్మజీవి వ్యాధికి కారణం అవుతోంది. కానీ ఈ కుట్టిన వెంటనే వ్యాధి అనేది సోకదు. కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది లక్షణాలు బయటకు రావాలంటే. ఈ వ్యాధి కారకాలు మాత్రం రాత్రివేళ మనిషి శరీరంలోని రక్తంలో కదలాడుతాయి. అందుకే రాత్రివేళ రక్త నమూనాలు సేకరిస్తారు.
ఇలా పరీక్షలు చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రలు ద్వారా వ్యాధి సోకకుండా నియంత్రించవచ్చు. కానీ లక్షణాలు బయటపడ్డాక అయితే మాత్రం నివారణ అసాధ్యమనే చెప్పాలి. శరీరంలో ఏ భాగానికైతే సోకుతుందో అక్కడ నిత్యం శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం కొంతసేపు బ్యాండేజీ కట్టుకోవాలి. మళ్లీ మందు రాసుకోవాలి. ఆల్బెండజోల్, ఐవర్ మెక్టిన్, డీఈసీ రకాల మాత్రలను వేసుకోవాలి. ఇవి వేసుకోవడంతో వ్యాధి అక్కడితే ఆగిపోతుంది. లేనివారికి సోకే అవకాశం ఉండదు అని అధికారులు చెబుతున్నారు.