Snapchat Honey Trap : కనిపెంచిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకులను చేసింది. ఒక్కగానొక్క గారాల బిడ్డను మాయమాటలతో యువకుడు అపహరించుకుపోయాడన్న అనుమానంతో బాలిక తల్లిదండ్రులు అతడిని హతమార్చారు. సినిమాను తలపించే రీతిలో జరిగిన ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకోగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిజాంపేటకు చెందిన ఓ యువకుడు ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వచ్చారు. తండ్రి జగద్గిరిగుట్టలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతుల కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో బాలికను ఆటో డ్రైవరైన కుమార్ ట్రాప్ చేసి యూసఫ్‌గూడలోని ఓ గదిలో నిర్భందించాడు. లైంగిక దాడికి యత్నించగా, బాలిక తప్పించుకుంది. అలా తప్పించుకున్న బాలిక బాలానగర్‌లో పోలీసులకు కనిపించింది. వివరాలు అడిగితే తాను అనాథను అని చెప్పగా, వారు నింబోలిగడ్డ హోంకు తరలించారు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుమార్తె గురించి తెలుసుకునే క్రమంలో బాలిక ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా, స్నాప్‌చాట్‌లో ఓ ఫోన్ నంబర్‌ను గుర్తించారు. అది ఆటో డ్రైవర్ కుమార్‌దని తెలుసుకున్నారు.
పెళ్లికాని ప్రసాద్‌లు, అలాంటి పురుషోత్తములకు అలర్ట్! - ఆ భామల చూపులకు కాస్త దూరంగా ఉండండి
ఐడీ క్రియేట్ చేసి ఆట మొదలు : అతనే తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటాడని ఆ తల్లిదండ్రులు భావించారు. దీంతో ఆ బాలిక తల్లి స్పాప్‌చాట్‌లో ఓ ఐడీని క్రియేట్ చేసింది. ఆ యువకుడికి రిక్వెస్ట్ పెట్టి తనను హనీట్రాప్ చేసింది. ఆ యువకుడిని మియాపూర్ రప్పించింది. ఆ బాలిక తల్లిదండ్రులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. తమ కుమార్తె గురించి చెప్పాలని అడిగారు. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత తన దగ్గరి నుంచి తప్పించుకుపోయిందని వాళ్లకు కుమార్ చెప్పాడు. వారు కొట్టిన దెబ్బలకు అపస్మారక స్థితిలోకి వెళ్లిన డ్రైవర్‌ను వారు కిడ్నాప్ చేశారు. అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట వైపు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆపి బండరాయికి అతని కాళ్లు, చేతులు కట్టి నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి బతికుండగానే విసిరేశారు.
కొన్ని రోజుల తర్వాత బాలిక, వారి తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది. మరోవైపు కుమార్ కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కుమార్ ఆటోను కార్ డ్రైవరైన బాలిక తండ్రి వాడుతుండగా, వారి కుటుంబసభ్యులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయమంతా చెప్పాడు. వారి సమాచారం మేరకు కాలువ దగ్గరికి వెళ్లి ఆటోడ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
వలపు వలతో తెలుగు యువత విలవిల - ఆ జిల్లాలోనే ఎక్కువ మంది బాధితులు