Game Changer Release Date:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రెడీ అవుతున్న పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా రిలీజ్ కోసం చరణ్ అభిమానులే కాదు, టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో రిలీజ్ డేట్ కోసం ఏ ఒక్క అప్‌డేట్ అయినా వస్తుందా అని ఆశగా ఎదురుచూపులు ఎక్కువైపోయాయి.
ఈ ఉత్కంఠకు తెరపడేలా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు సినిమా యూనిట్ రెడీ అయిపోయింది. రీసెంట్‌గా వస్తున్న సమాచారాన్ని బట్టి వినాయక చవితి పండగ రోజున విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. నిర్మాత దిల్రాజు ఇదివరకే చెప్పినట్లుగా కచ్చితంగా క్రిస్మస్ సందర్భంగానే ఉంటుందని మరో వార్త చక్కర్లు కొడుతుంది. అంటే 2024 డిసెంబర్ 20వ తేదీని లాక్ చేసి పెట్టారట ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇక సెప్టెంబర్ చివరి వారంలో టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఒకటైనా దసరాకు రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టక ముందే శంకర్ 'భారతీయుడు 2' సగం పూర్తి చేశారు. 'గేమ్ ఛేంజర్' మొదలైన కొద్ది నెలలకు మిగిలిన సినిమా కంప్లీట్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నారు. అలా 'గేమ్ ఛేంజర్'కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా సినిమా పూర్తి కావడానికి కాస్త ఆలస్యం అయింది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది.