Rajinikanth Lal Salaam Trailer : సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపులో వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఇందులో భాగంగానే ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలామ్' అనే చిత్రంలోనూ నటించారు. ఈ మూవీ మరో మూడు రోజుల్లో(ఫిబ్రవరి 9) విడుదల కానుంది. అయితే ఈ చిత్రం గురించి పెద్దగా ఎక్కడా వినపడట్లేదు. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి ట్రైలర్‌ను(Lal Salaam Trailer) విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్‌ఫుల్‌గా సాగింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం రజినీకాంత్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. మెయినుద్దీన్ భాయ్‌గా రజనీ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. అయితే ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. స్పెషల్ క్యామియో అయినప్పటికీ కథలో ఎంతో కీలకంగా ఉండే పాత్ర అని తెలుస్తోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. గతంలో రజనీ కాంత్ వాయిస్ ఓవర్‌తో 'సినిమా వీరన్' అనే డాక్యుమెంటరీని కూడా రూపొందించింది ఐశ్వర్య. ఇప్పుడు తొలిసారిగా తన తండ్రిని డైరెక్ట్ చేసింది.