Rajinikanth Laal Salaam Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ - 'జైలర్'తో హిట్ కొట్టి మళ్లీ సక్కెస్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. మరి ఆ రేంజ్ భారీ హిట్ కొట్టిన తర్వాత ఆయన నటించిన మరో కొత్త చిత్రం వస్తుంటే హైప్ ఎలా ఉండాలి? ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉండాలి? కానీ ఆయన కొత్త సినిమా 'లాల్ సలామ్'కు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి హైప్ కనపడట్లేదు. ఇంకా చెప్పాలంటే చాలా మందికి రజనీ ఈ సినిమాతో వస్తున్నారని కూడా తెలీదు!
నో తెలుగు ట్రైలర్: ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. అంటే మరో 48 గంటల సమయం కూడా లేదు. కానీ ఇంకా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేయలేదు మేకర్స్. తమిళంలో మాత్రం ఈ ట్రైలర్ రిలీజై 24 గంటలు గడిచింది. మరి తెలుగులో ఈ ప్రచార చిత్రం ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. అసలు ఈ మూవీ మేకర్స్ తెలుగు రిలీజ్ గురించి పట్టించుకుంటున్నారా? లేదా? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ఒక్క థియేటరే : స్టార్ హీరో చిత్రం రిలీజ్ అవుతుంటే రిలీజ్‌కు రెండు రోజుల ముందు నుంచే బుకింగ్స్ ప్రారంభమవుతాయి. కానీ లాల్ సలామ్‌లో రజనీకాంత్ నటించినప్పటికీ అలా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నగరాల్లోని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలే కాలేదు. ప్రస్తుతానికి ఒకే ఒక్క థియేటర్, క్రాస్ రోడ్స్ సప్తగిరిలో బుకింగ్స్ ఓపెన్ చేశారు.