Rajamouli Pawankalyan Movie :దర్శక ధీరుడు రాజమౌళి దాదాపుగా టాలీవుడ్ స్టార్స్ అందరితో సినిమాలు చేసేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోయే సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. అంటే ఇంకా మిగిలి ఉంది పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మాత్రమే. అయితే పవన్‌తో జక్కన్న సినిమా ఎందుకు చేయలేదనే ప్రశ్న చాలా సార్లు ఎదురౌతూనే ఉంటుంది. అయితే దీనిపై రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడారు.
ఆయన ఎప్పటికప్పుడు ఇంటర్య్యూలలో వరుసగా పాల్గొంటూ జక్కన్న అప్‌కమింగ్ సినిమాలపై అప్డేట్స్ ఇస్తుంటారు. అలానే చాలాసార్లు పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని కూడా చెప్పారు. అయితే తన కొడుకు రాజమౌళి - పవన్ కాంబోలో సినిమాను మాత్రం సెట్ చేయలేకపోయారు.
ఎవరూ చేయలేరు :ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ - సమయం, సందర్భం కుదరాలి కదా. అయినా నిర్మాతలు ఎవరూ పవన్ కళ్యాణ్ డేట్స్‌తో మా దగ్గరికి రాలేదు. బాహుబలి వరకు కూడా వేరే హీరోల డేట్స్‌తోనే ముందుకు వచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్‌తో మరో స్టార్‌ను పెట్టి సినిమా చేయాలన్నా ఆయన రేంజ్‌కు తగ్గట్టూ ఎవరూ చేయలేరు. ఆయనొక సూపర్ డూపర్ మెగాస్టార్. అందుకే సినిమా చేయాలన్న ఆలోచన రాలేదు. మహేశ్ బాబుతో సినిమా చేయాలనే కమిట్మెంట్ పదేళ్ల క్రితం అనుకున్నదే. మరి దీని తర్వాత పవన్ కళ్యాణ్‌తో వస్తుందేమో చూడాలి అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను మళ్లీ దర్శకత్వం చేస్తానని కూడా అన్నారు విజయేంద్ర ప్రసాద్. అందులో చాలా మంది నటీనటులు ఉంటారని చెప్పారు.