తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇండియన్‌ చార్లీచాప్లిన్‌​ - వందేళ్లైనా తగ్గని క్రేజ్​ - హీరో కారును గాల్లోకి ఎత్తేసిన అభిమానులు! - RAJ KAPOORS 100TH BIRTH ANNIVERSARY

భారతీయ సినిమా షో మ్యాన్‌ రాజ్‌కపూర్‌ శతజయంతి.

Raj Kapoors 100th Birth Anniversary
Raj Kapoors 100th Birth Anniversary (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2024, 7:05 AM IST

Raj Kapoors 100th Birth Anniversary : ఆయన జన్మించి నూరేళ్లు. మరణించి ముప్పై ఆరేళ్లు. ఆయన మొదటి సినిమా 'ఆగ్‌' వచ్చి 75 ఏళ్లు. ఇప్పటికీ రష్యా వెళ్తే వినిపించే పాట 'ఆవారా హూ'. ఆయన మరెవరో కాదు 'ది గ్రేటెస్ట్‌ షో మ్యాన్ ఆఫ్​ ఇండియా'​ రాజ్​ కపూర్​. చైనాలోనూ ఇప్పటికీ, ఎప్పటికీ వినిపించే భారతీయ నటుడి పేరంటే ఆయనదే. నేడు రాజ్​ కపూర్​ శత జయంతి వేడుక సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

రాజ్‌కపూర్‌ అప్పటి అవిభక్త భారత దేశంలోని పెషావర్‌లో డిసెంబరు 14, 1924న జన్మించారు. థియేటర్‌ కింగ్‌ పృథ్వీరాజ్‌ కపూర్‌కు పెద్ద కుమారుడు. చాలా చిన్న వయసులోనే స్టూడియోలో శిష్యరికం చేసిన రాజ్‌, తన తండ్రి నటించిన ఇంక్విలాబ్‌ అనే చిత్రంలో మొదటిసారి కనిపించారు.

ఆ తర్వాత ఆయన కొన్నాళ్లకు సహాయ దర్శకుడిగా కేదార్‌ శర్మ వద్ద చేరారు. 1947లో వచ్చిన నీల్‌ కమల్‌తో రాజ్‌కపూర్‌కు తొలి విజయం దక్కింది. దానిని తెరకెక్కించింది శర్మే.

అయితే రాజ్‌కపూర్‌ నిర్మించిన సినిమాలు కమర్షియల్​ అయినప్పటికీ అందులోనూ ఎప్పుడూ ప్రేక్షకులకు బలమైన సందేశాన్నే ఇచ్చేవారు. సినిమా అంటే వ్యాపార వినోద సాధనం మాత్రమే కాదు, సామాజిక నిబద్ధతను కలిగిన గొప్ప మాధ్యమంగా ఆయన భావించేవారు. రాజ్ నటించిన చాలా సినిమాలు విలువలు, మానవ సంబంధాల గురించి సందేశాన్ని ఇచ్చాయి.

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాజ్​ సుప్రసిద్ధుడు. భారతదేశంలో 3 జాతీయ చలన చిత్ర అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు.

రాజ్‌కపూర్‌ కెరీర్​లో 'ఆవారా', 'బూట్‌ పాలిష్‌' చిత్రాలకు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 'పామ్‌ డి ఓర్‌ గ్రాండ్‌' పురస్కారానికి రెండు సార్లు నామినేట్‌ అయ్యారు.

'ఆవారా'లో రాజ్​ నటన టైమ్‌ మ్యాగజైన్‌ వెల్లడించిన ప్రపంచపు అత్యుత్తమ పది అభినయాల్లో ఒకటిగా నిలిచింది.

'శ్రీ 420', 'సంగమ్‌', 'అనారీ', 'చోరీ చోరీ', 'జిస్‌ దేశ్‌ మే గంగా బెహతీ హై', 'కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌' లాంటి చిత్రాలు రాజ్‌కపూర్‌ కెరీర్‌లో గొప్ప క్లాసిక్‌ చిత్రాలుగా నిలిచిపోయాయి.

ముఖ్యంగా రాజ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఆసియా, యూరప్‌ల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవి. అందుకే రాజ్‌కపూర్‌ను 'భారత చలన చిత్ర పరిశ్రమ క్లార్క్‌ గేబుల్‌' అని ప్రపంచ సినిమానే మెచ్చుకుంది. ‘భారతీయ సినిమా చార్లీ చాప్లిన్‌ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు కూడా రాజ్‌కపూర్​దే.

అలా తుదిశ్వాస విడిచారు - అప్పుడు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నాక రాజ్‌కపూర్‌ సభా ప్రాంగణంలో కుప్పకూలిపోయారు. ఆయన్ని ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందించారు. అయితే అప్పటికే గత కొన్నేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్న ఆయన 1988లో తుదిశ్వాస విడిచి, భారతీయ సినీ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేశారు.

రాజ్‌కపూర్‌ ఈ భూమ్మీదకు వచ్చి వందేళ్లు పూర్తైనా, ఆయన సినిమాలు, అందులోని గొప్ప గీతాల వన్నె తగ్గకపోవడం.. దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ప్రతిభకు.. నటుడిగా ఆయన గొప్ప అభినయానికి నిలువెత్తు నిదర్శనం.

కారునే గాల్లోకి ఎత్తేశారు - ఇంకా చెప్పాలంటే పద్మభూషణ్‌ రాజ్‌ను మరో వందేళ్లు దాటినా ఈ దేశం మరచిపోదనే చెప్పాలి. రష్యాలో ఆయనకు విపరీతంగా అభిమానులు ఉంటేవారు. అప్పట్లో మాస్కో విమానాశ్రయం బయట రాజ్‌ను గుర్తుపట్టి చుట్టుముట్టిన అభిమానులు ఆయన ఎక్కిన ట్యాక్సీని అమాంతం గాల్లోకి ఎత్తాశారంట. అంటే రష్యాలోనూ ఆయనకున్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆ రెండు చిత్రాలు ఎంతో ప్రత్యేకం -దర్శక నిర్మాతగా రాజ్‌కపూర్‌ రూపొందించిన చిత్రాలు ఆవారా, శ్రీ 420 చూస్తే చాలు. వందేళ్లు దాటినా ఆయనను ఎందుకు గుర్తుపెట్టుకోవాలో ఈ తరానికి కూడా బాగా అర్థమవుతుంది. మనిషి పుట్టుక కాదు, సామాజిక పరిస్థితులు మారాలనే గట్టి సందేశం 'ఆవారా' ఇస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బీఏ డిగ్రీతో, ఎన్నో కలలతో బొంబాయి నగరంలో అడుగుపెట్టిన ఓ నిరుద్యోగి కథ 'శ్రీ 420'.

'ఇది మనందరి తప్పు' - అల్లు అర్జున్​ అరెస్ట్​పై స్పందించిన హీరో నాని

అల్లు అర్జున్ అరెస్ట్​పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో

ABOUT THE AUTHOR

...view details