Radhika Apte Pregnancy Delivery : 'లెజెండ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రాధికా ఆప్టే. అయితే రీసెంట్గా ఆమె తల్లి అయిన సంగతి తెలిసిందే. బేబీ బంప్ ఫొటోషూట్ కూడా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగమ్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాధిక ఇంటర్వ్యూ ఇచ్చింది. తన ప్రెగ్నెన్సీ ప్రయాణం గురించి తెలిపింది. ఈ ప్రయాణంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు తెలిపింది.
"పిల్లల విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. గర్భం దాల్చానని తెలిసిన వెంటనే కంగారుపడ్డాను. డెలివరీకి కొద్ది రోజుల ముందే ఒక ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. అంత లావుగా నేను ఎప్పుడూ కనిపించలేదు. ఆ విధంగా నన్ను నేను చూసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. శరీరం నా అధీనంలో అస్సలు లేదు. సరిగ్గా నిద్ర ఉండేది కూడా కాదు. తల్లినైన తర్వాత శరీరం మళ్లీ మారిపోయింది. కొత్త సవాళ్లు, ఆవిష్కరణలతో విభిన్న దృక్పథం ఏర్పడింది. ఇప్పుడు ఆ ఫొటోలు చూసుకుంటే అప్పుడు అంత ఇబ్బంది పడకుండా ఉండాల్సిందనిపిస్తుంది. ఈ మార్పుల్లో కూడా నాకు ఒక అందం, ఆనందం ఉంది. భవిష్యత్తులో ఈ ఫొటోలు ఎప్పుడు చూసినా నాకు ఆనందమే కనిపిస్తుంది. ఏ మహిళకు అయినా గర్భం అనేది అంత సులభమైన విషయం కాదు. అదొక క్లిష్టతరమైన ప్రయాణం. మానసిక, శారీరక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల అండ ఎంతో అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో నా భర్త బెనెడిక్ట్ అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకుని నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ధైర్యం చెప్పారు"’ అని రాధిక పేర్కొన్నారు.