Brahmanandam Instagram Entry : స్టార్ కమెడియన్ బహ్మానందం లేని తెలుగు మీమ్ కంటెంట్‌ను బహుశా ఎవరూ ఊహించలేమేమో. సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్, మరే కమెడియన్‌కు దేశంలో లేదని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలాంటిది అంతటి ఫాలోయింగ్ కలిగి ఉన్న ఆయన నెట్టింట సందడి చేస్తే ఆ ఫీలింగ్ వేరు కదా. ఇప్పుడు అదే నిజమైంది.
బ్రహ్మానందం తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చేశారు. Yourbrahmanandam ఐడీతో ఆయన ఇన్‌స్టాలో ఇటీవల అడుగుపెట్టారు. తన కుమారుడు గౌతమ్‌తో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్న బ్రహ్మానందం మూవీకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో స్వయంగా ఇన్‌స్టా విషయాన్ని వెల్లడించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ మ్యాటర్ వైరల్‌గా మారింది.
మీరు సోషల్ మీడియాలో ఉన్నారా? ఐడీ చెబితే బ్రేక్ ఇస్తాం! అంటూ అభిమానులు బ్రహ్మిని అడగ్గా తన ఇన్‌స్టా ఐడీని ఆయన పంచుకున్నారు. తాను రాసిన పుస్తకం పేరు ఇట్లు మీ బ్రహ్మానందం అని దాని ఇంగ్లిష్ రూపం అయిన Yourbrahmanandam ఐడీతోనే తాను ఇన్‌స్టాలోకి వచ్చానని బ్రహ్మి తెలిపారు. ఆయన ఇన్‌స్టాలోకి రాగానే పెద్ద ఎత్తున అభిమానులు ఆయన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.
అయితే తెలుగు సినిమా చరిత్రలోనే బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ ఉండరంటే అతశయోక్తి కాదు. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ మరొకరు కనిపించరు. 60 ఏళ్ల వృద్ధుల నుంచి 20 ఏళ్ల యువతను ఒకేలా ఎంటర్టైన్ చేసి అందరిలో కూడా క్రేజ్ సంపాదించుకున్న అరుదైన కమెడియన్ ఆయననే చెప్పాలి.
ఇప్పుడు యువత అయితే సోషల్ మీడియాలో బ్రహ్మి పేరు చెబితే మీమ్స్ క్రియేట్ చేస్తూ ఊగిపోతూనే ఉంటారు. ఆయన లేని మీమ్ ఒక్కటి కూడా ఉండే ఉండదు. ఎలాంటి సందర్భంలో క్రియేట్ చేసిన మీమ్ అయినా బ్రహ్మీ ఫొటో కచ్చితంగా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. మరి రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన బ్రహ్మానందం తన మీమ్స్ చూసి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.