Pushpa 2 Dolby Vision Technology : డాల్బీ టెక్నాలజీని ఉద్దేశించి కింగ్ నాగార్జున ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ టెక్నాలజీకి సంబంధించిన ఏర్పాట్లు తమ స్టూడియోలో(అన్నపూర్ణ) చేసినట్లు ఆయన చెప్పారు. భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) వేడుకలో ఈ విషయాన్ని తెలిపారు.
"డాల్బీ విజన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ను తెరకెక్కించాలని దర్శకుడు రాజమౌళి అనుకున్నప్పుడు, ఇండియాలో దానికి సంబంధించిన సదుపాయాలు లేవు. దీంతో ఆయన జర్మనీ వెళ్లి మరీ ఆ పనులను పూర్తి చేశారు. అప్పుడే ఆ టెక్నాలజీని ఇక్కడకీ అందుబాటులోకి తీసుకురావాలని మేం నిర్ణయించుకున్నాము. ఇప్పుడు మేం డాల్బీని మా స్టూడియోలో ఏర్పాటు చేశాం. పుష్ప 2 చిత్రంతో మేం దానిని ప్రారంభిస్తున్నాం. ఇదే మొదటి సారి కావడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ఆడియెన్స్‌కు భిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ ఎంతగానో ఉపయోగపడుతుంది." అని నాగ్ చెప్పుకొచ్చారు.
ఇక ఇఫ్ఫీ ఈవెంట్ అనంతరం నాగ్ మీడియాతో మాట్లాడుతూ, ఇఫ్ఫీ వేదికపై గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన తండ్రి ఏయన్నార్ నటించిన దేవదాసు ఎవర్ గ్రీన్ సినిమా అని చెప్పారు.