తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు వైల్డ్​ ఫైర్ ట్రీట్ - అల్లు అర్జున్‌ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే? - PUSHPA 2 TELUGU REVIEW

'పుష్ప 2' తెలుగు రివ్యూ : అల్లు అర్జున్‌ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Pushpa 2 Telugu Review
Pushpa 2 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2024, 6:36 AM IST

Pushpa 2 Telugu Review :పార్ట్​ 1తోనే అభిమానులను ఉర్రూతలూగించిన పుష్ప‌ మూవీ ఇప్పుడు పుష్ప ది రైజ్​గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అర్జున్, రష్మిక లీడ్ రోల్స్​లో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం గ్రాండ్​గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?

కథేంటంటే :
శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ను నడిపే ఓ నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్). తన దారికి ఎవ్వరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే తనకు తెలుసు. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే అస్సలు భయం లేదు. అలా తన పేరునే ఓ బ్రాండుగా మార్చేస్తాడు. ఇక ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్తో వైరం పెరిగి పెద్దదవుతుంది.

మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకీ విస్తరించడంపై దృష్టిపెడతాడు పుష్ప. అయితే పుష్ప బయట ఫైర్ కానీ, ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి (రష్మిక మందన్న) మాట అస్సలు జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫొటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. దీంతో కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్లాం చెప్పింది కదాని ఎమ్మెల్యే సిద్ధప్పనాయుడు (రావు రమేష్)తో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? షెకావత్‌ని ఢీ కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అతడు ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)కీ, పుష్పకీ ఉన్న లింక్ ఏంటి? అది వైరంగా ఎలా మారింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే :
ఫస్ట్​హాఫ్​తో పోలిస్తే, సుకుమార్ 'పుష్ప' ప్రపంచాన్ని, కథ, మేకింగ్‌ పరిధినీ ఈ సారి పెంచారు. తొలి సినిమాలో అల్లు అర్జున్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌నే నమ్ముకుని ఆయన పాత్ర, హీరోయిజంపైనే దృష్టిపెట్టిన డైరెక్టర్ ఈసారి తానూ ఛార్జ్ తీసుకున్నారు. కథలో తన మార్క్ సైకలాజికల్ గేమ్‌ని మేళవించే ప్రయత్నం చేశారు. దాంతో ఈసారి మరింత బాగా డ్రామా పండింది. దానికితోడు వైల్డ్ ఫైర్‌లాంటి పుష్ప‌రాజ్ ఉండనే ఉన్నారు. మరింత బలంగా తీర్చిదిద్దిన ఆ పాత్రపై అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో ప్రభావం చూపించారు. దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు సంబరమైతే, సాధారణ ప్రేక్షకులకూ ఓ మంచి మాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన డైరెక్టర్ అడుగడుగునా ఎలివేషన్స్‌తో కట్టిపడేసే ప్రయత్నం చేశారు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి విడిపించడం నుంచి సీఎం దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకూ సాగే సీన్స్ పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించారు డైరెక్టర్. ఆ తర్వాత మాల్దీవుల్లో బిజినెస్​ డీల్స్, అక్కడ వంద కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్‌.

ఇక పుష్ప, షెకావత్ ఒకరికొరు వేసే ఎత్తులు పైఎత్తులు అసలు సిసలు డ్రామాని పండిస్తాయి. ఫస్ట్​ హాఫ్​ అంతా ఒక ఎత్తు అయితే, ఇంటర్వెల్​కు ముందు వచ్చే సీన్స్ మరో ఎత్తు. పుష్ప - షెకావత్‌కి ఊహించని రీతిలో ఝలక్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు. ఇందులో ఫ్యామిలీ బ్యాక్​డ్రాప్​తో సాగే డ్రామా కూడా కీలకం. తన భార్య శ్రీవల్లి మాట జవదాటని భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్లిద్దరి మధ్య లవ్, పీలింగ్స్ సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. భర్త భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథతోనూ లింక్ పెట్టిన తీరు ఆడియెన్స్​ను ఆకట్టుకుంటుంది.

సెకెండ్​ హాఫ్​లో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ దద్దరిల్లిపోతుంది. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయిలో పండాయి. ఇదే జాతర ఎపిసోడ్‌లో శ్రీవల్లి పాత్ర కూడా చాలా కీలకం అయ్యింది. ఆ తర్వాత రెండు వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని రాష్ట్రం, దేశం సరిహద్దుల్ని దాటించే ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే చాలా వరకు కుటుంబం చుట్టూనే సన్నివేశాలు సాగాయి.

ప్రీ క్లైమాక్స్, అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే అప్పటిదాకా సాగిన కథ నుంచి పూర్తిగా బయటికొచ్చినట్టుగా అనిపిస్తాయి. స్టోరీలోని అసలైన డ్రామా కట్ అయినట్టు అనిపించినప్పటికీ పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే ఫైట్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అలరిస్తాయి. పాటలకి మంచి టైమింగ్ కుదిరింది. ఫస్ట్ హాఫ్​లో పీలింగ్ పాట మాస్‌తో విజిల్స్‌ వేయిస్తే, సెకండ్​ హాఫ్​లో సూసేకి, కిస్సిక్ పాటలు ఆ ఎనర్జీని మరోస్థాయికి తీసుకెళ్తాయి.

ఎవరెలా చేశారంటే?
అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆయన యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించారు. ఫైటింగ్ సీన్స్, డ్యాన్స్‌లపైనా మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్‌లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరోస్థాయిలో ఉంది. నేషనల్ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్‌లో తన నటనతో దాన్ని పటాపంచలు చేశాడు.

రష్మికతో బన్నీ కెమిస్ట్రీ బాగా కుదిరింది. పీలింగ్స్‌, సూసేకి పాటల్లో ఈ ఇద్దరి జోడీ, వాళ్లు కలిసి చేసిన డ్యాన్సులు ప్రేక్షకులను మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాతో గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్‌లోనూ ఆమె నటన చాలా బాగుంది. 'కిస్సిక్' పాటతో శ్రీలీల డ్యాన్స్‌తో దుమ్మురేపింది.

షెకావత్ పాత్రలోఫహద్ ఫాజిల్ ఒదిగిపోయారు. అయితే ఆయన పాత్ర చాలా చోట్ల తేలిపోయింది. ఒకానొన స్థాయిలో పరిచయమైన ఆ పాత్రలో సినిమా సాగుతున్న కొద్దీ సీరియస్‌నెస్ తగ్గిపోతున్నట్లు అనిపించింది. ఆ పాత్ర ముగింపు కూడా అంత లాజికల్‌గా అనిపించదు. రావు రమేష్​కు తప్ప అనసూయ, సునీల్‌ తదితరుల పాత్రలకు ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. పతాక సన్నివేశాల్లో జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప ఆడియెన్స్​ను భయపెడతారు. అల్లుఅర్జున్‌కి స్నేహితుడిగా జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తారు. 'పుష్ప1'కథను కేశవ పాత్రతో చెప్పించారు. దానివల్ల ఈ కథనంలో ఓ మేజిక్‌ ఏర్పడింది. కానీ ఇందులో అది మిస్ అయ్యింది.

సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ప్రతి డిపార్ట్​మెంట్​ మంచి పనితీరుని చూపించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో కట్టిపడేశారు. సామ్ సీఎస్ కూడా బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​లో కీలక పాత్ర పోషించారు. కూబా కెమెరా పనితనం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది.

ఇదిలా ఉండగా, కెమెరాతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ టీమ్ పనితీరుతో ప్రతి ఎపిసోడ్ గ్రాండియర్‌గా కనిపించింది. శ్రీకాంత్ విస్సా మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కానీ ఎడిటింగ్‌లోనే పదును లేదు. సినిమా స్థాయి, అంచనాల మేరకు రాజీపడకుండా సాగిన సుకుమార్ మేకింగ్‌ హీరోయిజం, భావోద్వేగాల పరంగా ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. విలన్​ పాత్రలను డిజైన్ చేసిన విధానంలోనే కొన్ని లోపాలు కనిపిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సీన్​లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది.

బలాలు

  • + అల్లు అర్జున్ నటన
  • +మాస్ ఎలివేషన్స్
  • +జాతర ఎపిసోడ్‌లో భావోద్వేగాలు
  • +పాటలు, డ్యాన్స్

    బలహీనతలు
  • - బలం లేని విలనిజం
  • -ద్వితీయార్థంలో కథ
  • చివరిగా : 'పుష్ప 2' థియేటర్లలో అల్లుఅర్జున్‌ రప్ప రప్పా
  • గమినిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details