Puneeth Rajkumar Birth Anniversary :కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ చిన్న కుమారుడిగా పునీత్ రాజ్‌కుమార్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఆయన్ను అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పేరుతోనే అభిమానుల మదిలో స్థానాన్ని సంపాదించుకున్నారు.
కేవలం సినిమాలతోనే కాదూ తన వ్యక్తిత్వంతోనూ వేలాదిమంది ప్రజల మనసును గెలుచుకున్నారు పునీత్. ఎప్పుడూ నవ్వుతూ ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే ఈయన సామాజిక సేవల్లోనూ ముందుంటారు. పిల్లలకు ఉచిత చదువు, వృద్ధుల కోసం ఆశ్రమాలు కట్టించారాయన.
ఇక టాలీవుడ్లో పునీత్కున్న అనుబంధం విషయానికొస్తే మొదటగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ - పునీత్ స్నేహబంధం. వీరిద్దరి మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. తారక్ అంటే పునీత్‌కు ఎంతో అభిమానం. తన సోదరుడిగా భావిస్తారు. ఈ విషయాన్ని చాలా సార్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ బెంగళూరు వెళ్లినా అప్పు ఇంటికి తప్పకుండా వెళ్తారట. ఇక అప్పు కోసం చక్రవ్యూహ చిత్రంలో ఎన్టీఆర్ 'గెలియా గెలియా' అనే పాటను కూడా పాడి అలరించారు. నటసింహం బాలయ్యతోనూ పునీత్ బాగా కలిసే ఉంటారు.
మిగతా హీరోలతోనూ పునీత్‌కు మంచి అనుబంధమే ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌బాబు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరితో పునీత్ ఎంతో స్నేహంగా కలిసి ఉన్న సందర్భాలు ఉన్నాయి. పునీత్ తన అన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్ కొడుకు పెళ్లి సమయంలో హైదరాబాద్‌కు వచ్చి మరీ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు. ఎందుకంటే చిరుకు మొదటి నుంచి రాజ్‌కుమార్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి.
యువరత్న సినిమా ఇక్కడ విడుదలైనప్పుడు హైదరాబాద్ వచ్చిన పునీత్‌ను చాలా మంది పవర్ స్టార్ అని పిలిచారు. పవర్‌స్టార్ అంటే ఎప్పుడూ పవన్‌కల్యాణే. నన్ను పునీత్ రాజ్‌కుమార్ అంటే చాలు అంటూ చెప్పి అభిమానుల మనసు దోచేశారు పునీత్. దూకుడు చిత్రాన్ని పునీత్ రీమేక్ చేయగా ఆ చిత్ర ప్రమోషన్స్‌కు మహేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు కూడా. అప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహబంధం చూసి అభిమానులు తెగ సంతోషపడిపోయారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అప్పట్లో పునీత్ నటించిన 'జాకీ' సినిమా ఆడియో లాంఛ్‌కు గెస్ట్‌గా హాజరయ్యారు.