Prithviraj Sukumaran Aadujeevitham : కథ, పాత్ర కోసం తమని తాము మార్చుకునే నటీనటులు అతికొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో మలయాళ డైరెక్టర్ కమ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. రీసెంట్గా ఆయన ప్రభాస్ సలార్ చిత్రంలో మరో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ఆడు జీవితం : ది గోట్ లైఫ్. బ్లెస్సీ దర్శకత్వం వహించి తెరకెక్కించారు. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 28న రిలీజ్కు రెడీ అయింది. మలయాళ భాషతో పాటు తెలుగులోనూ రానుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ విశేషాలతో పాటు, తన పాత్ర కోసం పడిన కష్టాన్ని తెలిపారు పృథ్వీరాజ్.
"ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు 98 కిలోల బరువు పెరిగాను. ఆ తర్వాత ఏకంగా 31 కిలోలు తగ్గాను. 67 కిలోల వరకు వచ్చాను. ఎందుకంటే ఎడారిలో దారి తప్పిపోయి, ఆకలితో అలమటించే వ్యక్తిగా కనపడాలంటే నేను కూడా భోజనం మానేయాలని నిర్ణయించుకున్నాను. కొద్ది రోజుల పాటు తినడం మానేసిన వ్యక్తి ఎలా కనిపిస్తారో అలాగే నేను కూడా కనపడాలనుకున్నాను. అందుకోసం చాలా సార్లు తినకుండా కూడా ఉండేవాడిని. కొన్నిసార్లైతే 72 గంటల పాటు కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగేవాడిని. లేదంటే కొద్దిగా బ్లాక్ కాఫీ తాగేవాడిని. ఇలాంటివి చేసేటప్పుడు మానసికంగానూ దీనికి సిద్ధంగా ఉండాలి. మనిషి శరీరం ఆహారం తినకపోయినా రెండు, మూడు రోజులు పాటు ఉంటుంది. కానీ, రెండో రోజు నుంచే ఏదైనా తినాలి అంటూ మెదడు కూడా చెబుతూ ఉంటుంది. ఇది పెద్ద సవాల్ లాంటింది" అంటూ చెప్పుకొచ్చారు.