Chakwadi Nala in Goshamahal : హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఫ్లైవుడ్ దుకాణాల ముందు చాక్వాడి నాలా మరోసారి కుంగింది. దీంతో నాలాపై ఉన్న క్రషర్ లారీ అందులో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులను పునరుద్ధరిస్తుండగా ఇప్పుడు అక్కడే మరో నాలా కుంగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాను పూర్తిగా పునరుద్ధరించాలని గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. తమ సమస్యను త్వరితగతిన వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రాణం పోతే ఎవరిది బాధ్యత? : ఈ నాలా అతిపురాతనమైనది కావడంతోనే ఇలా స్థానికులు కుంగినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ ఈ నాలా కుంగడం మూడోసారి. ఈ నాలా పునరుద్ధరణ విషయంలో పదే, పదే మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నాలాలు కుంగడం వల్ల ప్రాణ నష్టం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తూ పలు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించారు. ఈ నాలా కుంగడం కారణంగా నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెప్పారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఈ నాలా విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరించారు.