Game Changer Pre Release Event :గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ఆయన మాటలతో ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
'అల్లూరి సీతారామరాజు పాత్ర అద్భుతంగా చేశాడు. తన టాలెంట్‌తో ఆస్కార్ వరకూ వెళ్లిన నటుడు రామ్‌చరణ్. ఎంత ఎదిగినా, ఒదిగి ఉంటాడు. ఇండస్ట్రీలో అందరు హీరోలు తన ఫ్రెండ్సే. అతడు ఇంకా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. గేమ్ఛేంజర్ను బాగా చూడండి. సినిమా టీమ్ అందరికీ బెస్ట్ విషెస్. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి (నవ్వుతూ)' అన్నారు.
ఇక ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓజీ సినిమా గురించి కూడా మాట్లాడారు. అభిమానులు ఓజీ ఓజీ అని అరవడంపై స్పందించారు. 'మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ నా దుంప తెంపేస్తున్నారయ్యా (నవ్వుతూ). దాని గురించి వేరే మాట్లాడదాం. మూడు సినిమాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు. ఇక సీనియర్ డైరెక్టర్, నటుడు యస్ జే సూర్యతో ఆయనకున్న అనుబంధాన్ని కూడా పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.