Oscar Nominations 2025 :అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు అల్లకల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ఈ ఏడాది జరగాల్సిన ఆస్కార్ వేడుకలు రద్దు కానున్నాయన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఫిల్మ్ అకాడమీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. అటువంటి నిర్ణయాలేవీ తాము తీసుకోలేదంటూ అకాడమీకి చెందిన ఓ సభ్యురాలు తెలిపారు. అయితే ఒకవేళ వేడుకల్లో ఏదైనా మార్పులు ఉంటే ఆ విషయాన్ని ఫిల్మ్ అకాడమీనే స్వయంగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
సుమారు 96 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయలేదని, కొవిడ్ వల్ల మాత్రం ఒక్కసారి వాయిదా మాత్రమే వేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 1000 మంది ఈ వేడుకల వల్ల ఉపాధి పొందుతున్నారని అన్నారు.
వారి ఇళ్లు దగ్ధం
ఇదిలా ఉండగా, ఈ కార్చిచ్చు వల్ల అకాడమీకి చెందిన నలుగురు సభ్యుల ఇళ్లు బూడిదయ్యాయట. ఈ క్రమంలోనే ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ కాస్త వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకే జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది.
"లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే ఓటింగ్ వ్యవధిని మేము పొడిగించాలని భావిస్తున్నాం. ఈ క్రమంలోనే నామినేషన్లు ప్రకటించడానికి గల తేదీని మార్చాలని, అంతేకాకుండా సభ్యులకు తగినంత అదనపు సమయం ఇవ్వాలనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము" అని అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్, సీఈవో బిల్ క్రేమర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.