Netflix OTT Telugu Movies:నెట్‌ఫ్లిక్స్- ప్రస్తుత డిజిటల్ స్ట్రీమింగ్‌లో సత్తా చాటుతోంది. ఒకానొక దశలో హాలీవుడ్ మార్కెట్లోనే హవా ఉండగా, ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలోనూ నెట్‌ఫ్లిక్స్ మార్క్ కనిపిస్తోంది. క్వాలిటీతో కూడిన కంటెంట్, సక్సెస్ రేట్ కారణంగా ఓటీటీ యూజర్లు సైతం దీనికే జై కొడుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్లో రిలీజైన బడా హీరోల సినిమాల డిజిటల్ రైట్స్ దక్కించుకొని ఓటీటీలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ కాంపిటిషన్లో ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌ను వెనక్కి నెట్టి నెట్‌ఫ్లిక్స్ దూసుకుపోతోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ దెబ్బకు వేరే ఓటీటీ సంస్థలు ఢీలా పడటం ఖాయమనిస్తోంది.
కొంతకాలంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందడంలో ముందున్నాయి. ఇంతలో నెట్‌ఫ్లిక్స్ రాకెట్లా దూసుకొట్టి మిగతా ఓటీటీలకు గట్టి పోటీనిస్తోంది. రీసెంట్ డేస్‌లో సినిమాల డిజిటల్ హక్కులను పొందడంలో నెట్‌ఫ్లిక్స్ నెమ్మదిగా దూకుడు పెంచింది. పక్కా ప్లాన్‌తో భారీ పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఓటీటీలో ఆధిపత్యం చెలాయిస్తోంది.
ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ 'సలార్', 'యానిమల్', 'గుంటూరు కారం' సినిమాల రైట్స్ దక్కించుకొని ఓటీటీలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ మూడు సినిమాలు తక్కువ సమయంలో ఓటీటీలో విడుదలై టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. దీంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య మరింత పెరుగుతోంది. కొంతకాలం క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఆధిపత్యాన్ని చెలాయించింది. కానీ నెట్‌ఫ్లిక్స్ దూకుడుకు అమెజాన్ వెనుకపడిపోయిందనే చెప్పాలి. ఇక టాలీవుడ్ అప్‌కమింగ్ భారీ బడ్జెట్ మూవీస్ 'దేవర', 'పుష్ప ది రూల్' ఓటీటీ హక్కులు కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోవడం విశేషం. వీటితోపాటు నెట్‌ఫ్లిక్స్ మరికొంత మంది బడా హీరోల సినిమా హక్కులను కూడా సొంతం చేసుకుంది.