Pushpa 2 Hindi Collections : రిలీజ్‌కు ముందు నుంచే సరికొత్త రికార్డులు సృష్టించిన పుష్ప 2, విడుదల తర్వాత అంతకుమించి బాక్సాఫీస్ ముందు గర్జించింది. ఇప్పటికే పలు రికార్డులతో జోరు చూపిస్తోన్న ఆ చిత్రం తాజాగా మరో అరుదైన ఫీట్‌ను అందుకుంది. హిందీ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
రూ.632 కోట్లు కలెక్ట్ చేసి, 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రిలీజైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం విశేషం. తద్వారా హిందీలో భారీ నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్) వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
రూ.2 వేల కోట్లు సాధ్యమేనా?
ప్రస్తుతం పుష్ప 2 కలెక్షన్లు చూస్తుంటే వసూళ్ల ఇది సాధ్యమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో పలు తెలుగు చిత్రాలు రానున్నాయి. వాటి ఫలితం పుష్ప 2 వసూళ్లపై ప్రభావం చూపించొచ్చు. మరోవైపు బాలీవుడ్‌లో డిసెంబరు 25 వరకూ పెద్ద సినిమాలేమీ లేవు. క్రిస్మస్ కానుకగా వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ నటించిన 'బేబీ జాన్' రానుంది. అంటే మరికొన్ని రోజులు నార్త్ బాక్సాఫీస్ ముందు పుష్పరాజ్‌దే హవా ఉంటుంది. మరోవైపు, ఓవర్సీస్‌లోనూ పుష్ప 2 మంచి వసూళ్లను సాధిస్తోంది.
కాగా, 2021లో రిలీజైన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా పుష్ప 2 : ది రూల్ రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మరోవైపు, పుష్ప 2 3డీ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో ఈ వెర్షన్‌లో సినిమా చూడొచ్చని టీమ్ తెలిపింది. త్వరలోనే దేశవ్యాప్తంగా దీనిని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది.
@1500 కోట్లు - కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిన 'పుష్ప 2'