National Award Best Dance Choreographer Jani Master : జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్సర్ నుంచి స్టార్ డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగారు. కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. ఈ అవార్డుల్లో పెద్దగా తెలుగు సినిమాల(కార్తీకేయ 2 మినహా) పేర్లు వినిపించకపోయినా తెలుగు తేజం జానీ మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా(తిరుచిట్రంబళం - తమిళం) అవార్డు లభించింది. డ్యాన్సర్ సతీశ్ కృష్ణన్ మాస్టర్‌తో కలిసి సంయుక్తంగా ఈ పురస్కారం దక్కింది.
ఈ తిరుచిట్రంబళం సినిమాలో ధనుశ్, నిత్యా మేనన్ జంటగా నటించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటిలో మేఘం కరుకతా అనే సాంగ్‌కు జానీ మాస్టర్ కోరియోగ్రఫీని అందించారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను అందుకుంది.
అయితే టాలీవుడ్‌కు చెందిన జానీ మాస్టర్ గత కొద్ది కాలంగా కోలీవుడ్‌లోనూ ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దళపతి విజయ్, ధనుశ్, రజనీ కాంత్ లాంటి అగ్ర హీరోలతో స్టెప్పులేయిస్తున్నారు. బీస్ట్‌లో ఆయన కంపోజ్ చేసిన అరబిక్ కుతూ, వారిసులో రంజితమే, జైలర్‌లో నువ్వు కావాలయ్యా వంటి సాంగ్స్ అయితే యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ కొల్లగొట్టడంతో పాటు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఆడియెన్స్ అంతా ఈ సాంగ్స్‌కు తెగ రీల్స్ చేశారు. ఇంకా ఆయన ఆర్య, సూర్య, కార్తి, శివ కార్తికేయన్ వంటి హీరోలు చిందులేసిన పాటలకు కొరియోగ్రఫీ చేశారు.