Balakrishna Sankranti Movies :తెలుగు తెరపై సంక్రాంతి హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఏడాది తిరిగే సరికి పండుగ బరిలో సినిమాను దించేవారు బుర్రిపాలెం బుల్లోడు. ఆ తర్వాత ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ సంక్రాంతి సందడంతా తనదే అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వరకు బాలయ్య నటించిన 108 చిత్రాల్లో దాదాపు 22 చిత్రాలు సంక్రాంతి పండుగకు విడుదలై సందడి చేశాయి. అందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్‌ను మోత మోగిస్తూ, సంక్రాంతి పండుగంటే రైతులదే కాదు, నందమూరి బాలయ్య అభిమానులదే అనేంతగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనేలా చేశారు.
2023లో 'వీరసింహారెడ్డి'తో 'మైలురాయికి మీసం మెలిపించిన బాలయ్య' తన DNAలో ఉన్న పొగరేంటో చూపించారు. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్ దగ్గరే కాదు, పసిపిల్లల దగ్గరి నుంచి పండు ముసలివాళ్లు సైతం 'జై బాలయ్య' అని ముద్దుగా పిలుచుకునేలా చేశారు. 2023 సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగంవత్ కేసరి' హ్యాట్రిక్ విజయాలతో ఉన్న బాలయ్య అదే జోరును 2025లో తెరపై చూపించకుండా ఉంటారా? తనకు అచొచ్చిన సంక్రాంతికి సందడి చేసేందుకు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్' ను ఎంచుకున్నారు. అప్పుడెప్పుడో 'ఆదిత్య 369'లో ముసుగు దొంగలా వచ్చి కృష్ణకుమార్‌ను కాపాడిన కృష్ణదేవరాయులును గుర్తు చేస్తూ, 'చెడ్డవాళ్లకు డాకు, మంచివాళ్లకు మహారాజ్' అనిపించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రాయలసీమ తన అడ్డగా పవర్ పుల్ పాత్రలో ప్రత్యక్షమై థియేటర్లో పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.
సంక్రాంతి హీరో
బాలకృష్ణ ఇప్పటి వరకు చేసిన 108 సినిమాల్లో దాదాపు 22 చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. అందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు అందుకున్నాయి. అందుకే బాలయ్యను తమ అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు సైతం 'సంక్రాంతి హీరో' అంటుంటారు. ఇప్పుడు 109వ చిత్రంగా 'డాకు మహారాజ్'తో సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య, తన చరిత్రను తానే తిరగరాస్తానని చెబుతున్నారు.