Mrunal Thakur Comments On Bollywood : ప్రతిఒక్కరూ 'రొమాంటిక్ సినిమాలా' అని తమకు ఇష్టం లేనుట్లుగా అందరిముందు నటిస్తారు- కానీ, అలాంటి చిత్రాలే దొంగచాటుగా చూస్తారు అని అన్నారు బ్యూటీ మృణాల్ ఠాకూర్. 'సీతారామం'లో సీతగా, ఇటీవల వచ్చిన 'హాయ్ నాన్న'లో యష్నగా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
యాంకర్ : కథలు, పాత్రల ఎంపిక విషయంలో మీకు స్ఫూర్తినిచ్చే అంశాలేంటి?
మృణాల్ ఠాకూర్ :ఒక నటిగా నా ముఖానికి రంగేసుకున్నప్పటి నుంచి నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే. మృణాల్‌గా ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకోకున్నా ఫర్వాలేదు కానీ నా పాత్రలతో వాళ్ల మదిలో చెరగని ముద్ర వేయాలని అనుకున్నా. నా కథలు, పాత్రల ఎంపిక విషయంలో నాకు స్ఫూర్తినిచ్చేది ఇదే.
'తొందరపడి ఆ తప్పైతే చేయను'
'ఓసారి సీతగా గుర్తింపు తెచ్చుకుంటే ఆ తర్వాత నటించిన సినిమాతో ఆ పేరును మరిపించే మరో పాత్ర చేయాలని కోరుకుంటా. అలాంటి స్టోరీలను, క్యారెక్టర్లను అన్వేషించి అందిపుచ్చుకోవడం కోసం ఎంతో ఓపికతో ఎదురు చూస్తాను. తొందరపడి ఏ పాత్ర పడితే అది చేసి తప్పు చేయాలని అయితే నేను అస్సలు అనుకోను' అని పేర్కొన్నారు మృణాల్. ఇక తానెన్ని సినిమాలు చేశానన్న దాని కన్నా, తాను నటించిన పాత్రల్లో ఎన్ని ప్రేక్షకుల్లో గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయాయి అన్నదే తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని అన్నారు ఈ సీత అలియాస్ మృణాల్.
'ఇలాంటి సినిమాలే చూస్తారు'
మొదట్లో సీరియల్స్‌లో నటించిన మృణాల్ ఎంతో కష్టపడి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీతారామం సినిమాలో సీత పాత్రతో ఆకట్టుకొని ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. అయినా సరే తనకు బాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదంటూ ఫీలయ్యారు మృణాల్. 'ఉన్నట్టుండి రొమాంటిక్ జానర్లో సినిమాలు రావడం ఆగిపోయాయి. చాలామంది వీటిని చూసేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఇలాంటి సినిమాలు ఇష్టం లేదన్నట్లుగా పైకి నటిస్తారు. 'హాయ్ నాన్న', 'సీతారామం' లాంటి మంచి సినిమాలు వేరే భాషల్లోనూ వస్తే చేయాలని ఉంది' అని చెప్పారు ఈ అమ్మడు.