Ganja Smugglers Car Hit Two Constables at Krishnavaram Toll Plaza : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై రెండు ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల సరఫరా, వాడకాన్ని కట్టడి చేయాలని పోలీసు శాఖకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో పోలీసులు కూడా వీటి నియంత్రణపై దృష్టి సారించారు. అనుమానం వచ్చిన వాహనాలను ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు : నూతన సంవత్సర వేళ వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి తరలిస్తున్న కారును ఆపడంతో ఇద్దరు కానిస్టేబుళ్ల మీద నుంచి దూసుకుపోయింది. ఈ ఘటన ఏపీలోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ జి.సతీష్, కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు.
చేస్ చేసి నిందితులను పట్టుకున్న పోలీసులు : అర్ధరాత్రి సుమారు ఒంటి గంటన్నర సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కారు టోల్ ప్లాజా వద్ద ఆగింది. అనుమానం వచ్చిన పోలీసులు కారుని చుట్టుముట్టి డ్రైవర్ను వివరాలు అడగడం ప్రారంభించారు. ఈలోపు ఫాస్ట్ ట్రాక్ ద్వారా టోల్ పన్ను చెల్లించడం, టోల్ గేటు తెరుచుకుంది. దీంతో కారును రహదారి పక్కకు ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా అతి వేగంగా ముందుకు పోనిచ్చాడు.
అప్పటికే కారు ముందు ఉన్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్ను ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోయింది. అప్రమత్తమైన పోలీసులు జాతీయ రహదారిపై వాహనాన్నివెంబడించారు. రాజానగరం వద్ద కారును వదిలేసి దుండగులు పరారయ్యారు. కారును, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీలుగుమిల్లి వద్ద నిందితులిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ లోవరాజుతో పాటు గాయపడ్డ మరో కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ : మరోవైపు కారు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోయిన ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
VIRAL VIDEO : ఏ బ్రాండ్ తాగావ్ సామీ - ఏకంగా అక్కడ పడుకున్నావ్
ఇన్‌స్పెక్టర్‌కు రూ.లక్షన్నర.. ఎస్‌ఐలకు రూ.50 వేలు - గంజాయి డాన్ కేసులో బయటకొస్తున్న నిజాలు