Mehreen Pirzada Egg Freezing Controversy :స్టార్ హీరోయిన్ మెహరీన్ పిర్జాదా ఇటీవలె సోషల్ మీడియా వేదికగా ఎగ్ ఫ్రీజింగ్‌కు సంబంధించిన ఓ వీడియో అప్లోడ్ చేశారు. అందులో ఆమె ప్రక్రియను వివరిస్తూ నెటిజన్లకు ఈ విషయంపై అవగాహన కల్పించేలా ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. అంతే కాకుండా మెహరీన్‌పై పలు రూమర్స్ కూడా వచ్చాయి. దీంతో ఆ విషయంపై ఆమె తాజాగా స్పందించారు.
తన వ్యాఖ్యాలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని వార్తలు రాశారంటూ మండిపడ్డారు. వాళ్లందరూ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు.
"కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసే వ్యక్తులు తమ వృత్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకుని వార్తలను రాయండి. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడం అనైతికమే కాదు, చట్ట విరుద్ధం కూడా. ఇటీవల నేను పెట్టిన 'ఫ్రీజింగ్ ఎగ్స్' పోస్ట్‌పై పలువురు రకరకాలుగా వార్తలు రాశారు. నేను ధైర్యం చేసి ఈ విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడాను. ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం మహిళలు ప్రెగ్నెంట్ కావాల్సిన అవసరం లేదు. బాధ్యతయుతమైన ఓ సెలబ్రిటీగా కొందరికి దీని గురించి అవగాహన కల్పించడం కోసమే నేను ఆ పోస్ట్ షేర్ చేశాను. పిల్లలు అప్పుడే వద్దనుకునే తల్లిదండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. దీని గురించి తెలియకుండా మీరు మీ స్వార్థం కోసం తప్పుడు కథనాలను ప్రచురించారు. నేను ప్రెగ్నెంట్ అంటూ రాసుకొచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు మీ అందరూ ఫుల్‌స్టాప్ పెట్టకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాపై పెట్టిన పోస్ట్‌లన్నింటినీ తొలగించండి. బహిరంగ క్షమాపణలు చెప్పండి" అంటూ మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు.