Chiranjeevi ANR National Award 2024 :అక్కినేని నాగేశ్వరరావు (ANR Awards) జాతీయ అవార్డు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నాఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. కాగా, 2024 సంవత్సరానికి గాను ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని అక్కినేని ఫౌండేషన్ చిరంజీవికి ప్రదానం చేసింది.
ఇప్పుడు ఇంట గెలిచాను
పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఎన్ని అందుకున్నా అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడంతోనే తాను ఇంట గెలిచానని మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. తన నట జీవితానికి సంపూర్ణత చేకూరిందని ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సినీ రంగంలో బాద్షా లాంటి అమితాబ్చన్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు చిరంజీవి. తనకు గురువు, మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత అమితాబచ్చన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని కుటుంబం తనపై చూపించే ప్రేమ, అప్యాయతలకు ఎప్పటికి దాసుడనేనన్న మెగాస్టార్, భగవంతుడు తనకు ఇచ్చిన అద్భుతమైన స్నేహిడుతు నాగార్జున అని అభివర్ణించారు. ఈ సందర్భంగా తన తల్లి అంజనాదేవి అక్కినేని సీనియర్ అభిమానుల్లో ఒకరని గుర్తుచేసుకున్నారు.
నేనూ టాలీవుడ్ వ్యక్తినే
'చిరంజీవి, నాగార్జున, నాగ్ అశ్విన్ తదితరులు తమ సినిమాల్లో నన్ను భాగం చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో నేనూ సభ్యుడినే అని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటి నుంచి నన్నూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భాగంగా పరిగణించండి. వచ్చే సినిమాలోనూ నాకు అవకాశం ఇవ్వడాన్ని మర్చిపోవద్దు . అవార్డు అందజేత విషయంలో నాకు ఈ గౌరవం కల్పించిన అక్కినేని నాగేశ్వరరావు ఫౌండేషన్, నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు' అని అమితాబ్ బచ్చన్ అన్నారు.