Indian Actor Who Was Professional Wrestler : సుదీర్ఘ సినిమా జీవితం. ఐదు జాతీయ అవార్డులు, తొమ్మిది రాష్ట్ర అవార్డులు అందుకొన్నారు. పద్మ భూషణ్, పద్మశ్రీ సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. 64 ఏళ్ల వయస్సులోనూ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జానర్‌లలో సినిమాలు చూస్తూ భారీ హిట్‌లు సొంతం చేసుకుంటున్నారు. అంత పాపులర్ హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయనే మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ యాక్టర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినిమాలపై ఇంట్రెస్ట్ అలా మొదలైంది!
ఫ్యాన్స్ ముద్దుగా లాలేటా అనే పిలుచుకునే మోహన్‌లాల్ విశ్వనాథన్ కేరళలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి, తల్లి గృహిణి. ఇద్దరు కుమారుల్లో మోహన్‌లాల్ చిన్నవారు. ఆరో తరగతి చదువుతున్నప్పుడే ఆయనకు నటుడు కావాలనే కోరిక కలిగింది. స్కుల్లో వేసిన ఓ నాటకంలో 60 ఏళ్ల వృద్ధుడి పాత్రను పోషించి, మెప్పు పొందడం వల్ల ఆయనకు నటనపై ఆసక్తి మొదలైంది.
కుస్తీ ఛాంపియన్
మోహన్‌లాల్ నటనలో మాత్రమే కాదు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరిచారు. 1977, 1978 మధ్య రాష్ట్ర స్థాయి కుస్తీ ఛాంపియన్‌గా నిలిచారు. 'తిరనోట్టం' అనే మూవీతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఇదే ఆయన తొలి చిత్రం కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల, ఈ సినిమా రిలీజ్ 25 సంవత్సరాలు ఆలస్యమైంది. అయితే ఆ మూవీ విడుదలయ్యే సమయానికే మోహన్‌లాల్ సూపర్ స్టార్ అయిపోయారు.
బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఏదంటే?
1980లో విడుదలైన 'మంజిల్ విరింజ పూక్కల్' మోహన్‌లాల్‌కు పెద్ద బ్రేక్ వచ్చింది. ఇందులో ఆయన మోహన్ లాల్ విలన్‌గా నటించి మెప్పించారు. దీంతో కొన్నేళ్ల పాటు ఇటువంటి పాత్రల్లోనే ఆయన చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ 1985- 86 నాటికి మోహన్‌లాల్ సక్సెస్ఫుల్ యాక్టర్‌గా స్థిరపడ్డారు. ఆయన పాపులారిటీ ఏ రేంజ్‌కి వెళ్లిందంటే, 1982, 1986 మధ్యకాలంలో ఆయన సినిమాలు ప్రతి 15 రోజులకు ఒకటి విడుదలయ్యేది. అలా ఒక్క ఏడాదిలోనే మోహన్‌లాల్ ఏకంగా 34 సినిమాల్లో నటించారు.