Actor Govinda Cinema Journey : సుదీర్ఘకాలం వెండితెరను ఏలిన బాలీవుడ్ హీరోల్లో గోవింద ఒకరు. 1980స్లో మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన నటన, ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకొన్నారు. అయితే ఒకప్పుడు ఆయన సినీ జర్నీ ఎలా సాగిందంటే?
21 ఏళ్లకే సూపర్ స్టార్!
'లవ్ 86' సినిమాతో గోవింద ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. 1986లో 'ఇల్జామ్' అనే మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదలై హిట్ అయ్యాయి. దీంతో 21 సంవత్సరాలకే గోవింద సూపర్ స్టార్ అయిపోయారు. వెనువెంటనే 75 సినిమాలకు సంతకాలు చేసి షాక్ ఇచ్చారు. అయితే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ సలహా మేరకు, వాటిల్లో 25 ప్రాజెక్టులు వదులుకొన్నారు. అప్పటికే ఆ సినిమాలకు తీసుకొన్న అడ్వాన్సుల విషయంలో గోవింద ఆందోళన చెందినప్పటికీ, దిలీప్ కుమార్ నచ్చజెప్పడం వల్ల ముందడుగు వేశారు.
కెరీర్ ప్రారంభంలో గోవింద విరామం లేకుండా పనిచేశారు. రెండు వారాల పాటు సినిమాల సెట్స్‌లో బిజీగా ఉండి, 16 రోజులపాటు నిద్రపోని సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.
అయితే వరుస సినిమాలు చేస్తున్న గోవిందకు అదే స్థాయిలో సంపద పెరిగిందట. దీని గురించి 2014లో గోవింద సోదరుడు కీర్తి కుమార్ ఓ షోలో చెప్పుకొచ్చారు. "కెరీర్ ప్రారంభంలో గోవింద ఎలా ఖర్చు చేయాలో తెలియనంత డబ్బు సంపాదించారు. ఒకానొక సమయంలో, గోవింద 100 ఆటో రిక్షాలు కొనమని సూచించారు. సినిమాల్లో మరింత ఎదిగాక, 100 ట్రక్కులు కొనాలని కూడా ఆలోచించారు." అని గోవింద చెప్పుకొచ్చారు.