Manchu Manoj Tweet On Children Abuse In Online : చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతో పాటు అసహ్యమేస్తోందని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. హాస్యం ముసుగులో సోషల్ మీడియాలో నీచమైన వీడియోలు పెడుతున్నారని ఇలాంటి ప్రవర్తన సమాజానికి ప్రమాదమని తెలిపారు. పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందిస్తూ పోస్ట్ పెట్టారు.
Children Safety In Online :తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడం కోసం తాను ఏడాది క్రితం ఇన్‌స్టా ద్వారా ఒక వ్యక్తిని సంప్రదించానని మనోజ్ తెలిపారు. కానీ అతడి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈరోజు అదే వ్యక్తి సోషల్ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడని, పిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులను మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ అమ్మతోడు నిన్ను వదిలిపెట్టనని ఎక్స్‌లో వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Sai Dharam Tej Tweet About Child Safety In Online : ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమ ప్రపంచం క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని పేరెంట్స్‌కు విజ్ఞప్తి చేశారు. మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదని తెలిపారు.